Hyderabad: కిలోమీటరు ఊడ్చితే రూ.3.21 లక్షలట!
ABN , Publish Date - Jun 18 , 2024 | 10:09 AM
సాధారణ రోడ్లతో పోల్చుకుంటే పర్యాటకుల సందర్శించే ప్రాంతాల్లోని రోడ్ల పారిశుధ్యానికి నెలకు ఎనిమిది రెట్లు అధికంగా వ్యయం అవుతోంది. రెండు విడతలుగా 16 గంటలు కార్మికులు విధులు నిర్వర్తించినా, ఎక్కువ మంది సేవలు వినియోగించుకున్నా.. రెండు, మూడు రెట్లు.. అంటే రూ.1.20 లక్షల వరకు వెచ్చించాలి.
- పర్యాటక ప్రాంతాల్లో నెలవారీగా స్వీపింగ్ చార్జీలు చాలా ప్రియం
- సాధారణ రహదారులపై నెలకు రూ.40 వేలు
- ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం వల్లే చార్జీల్లో భారీ వ్యత్యాసం
- గత సర్కారు హయాంలో నిర్ణయం
- ముగిసిన గడువు.. పలు ప్రాంతాల్లో మళ్లీ పొడిగింపు
పర్యాటక ప్రాంతాల్లో స్వీపింగ్ చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. కిలోమీటరు రోడ్డును శుభ్రం చేసేందుకు నెలకు ఏకంగా రూ.3.21 లక్షలు వెచ్చిస్తున్నారు. అదే సాధారణ రోడ్డులో పారిశుధ్య నిర్వహణకు కిలోమీటరుకు ప్రతినెలా రూ.40 వేలే ఖర్చు అవుతున్నది.
హైదరాబాద్ సిటీ: సాధారణ రోడ్లతో పోల్చుకుంటే పర్యాటకుల సందర్శించే ప్రాంతాల్లోని రోడ్ల పారిశుధ్యానికి నెలకు ఎనిమిది రెట్లు అధికంగా వ్యయం అవుతోంది. రెండు విడతలుగా 16 గంటలు కార్మికులు విధులు నిర్వర్తించినా, ఎక్కువ మంది సేవలు వినియోగించుకున్నా.. రెండు, మూడు రెట్లు.. అంటే రూ.1.20 లక్షల వరకు వెచ్చించాలి. కానీ ఏకంగా రూ.2లక్షలు అదనంగా ఎందుకు ఖర్చవుతోంది..? అంటే పారిశుధ్య నిర్వహణ విభాగం అధికారులు సమాధానం దాట వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో ప్రైవేట్ ఏజెన్సీ(Private agency)లకు పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలున్నాయి. గడువు ముగిసినా.. పలు ప్రాంతాల్లో ప్రస్తుతమూ అదే సంస్థల సేవలు పొడిగించినట్టు తెలిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో బాధ్యతలు కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినా.. పలు పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: సిటీ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హేగ్డే
పర్యాటక ప్రాంతాల్లో..
హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతాలున్నాయి. చార్మినార్, పైగా టూంబ్స్, సాలార్‌జంగ్ మ్యూజియం, మక్కా మసీద్, కుతుబ్ షాహీ టూంబ్స్, గోల్కొండ కోట, బాపూఘాట్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, బిర్లా టెంపుల్ తదితరాలను సందర్శించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. నిత్యం వేల మంది వస్తుండడం.. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదన్న అభిప్రాయం నేపథ్యంలో నాలుగేళ్ల్ల క్రితం జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతాల్లో చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. 2019 డిసెంబర్‌లో స్టాండింగ్ కమిటీ రెండు నెలల పాటు పైలట్‌గా ప్రాజెక్టు అప్పగించేందుకు ఆమోదించింది. అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ఎక్సోరా కార్పొరేట్ సర్వీసెస్, లా మెక్‌లీన్ సంస్థలను ఎంపిక చేశారు. తొమ్మిది ప్రాంతాల్లోని 73.75 కి.మీల కారిడార్లలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ఆ రెండు సంస్థలకు అప్పగిస్తూ 2020లో నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాల సమీపంలోని రహదారులను స్ర్టెచ్‌లుగా విభజిస్తూ ఏజెన్సీలను ఎంపిక చేశారు. 73.5 కి.మీల రోడ్లకు నెలకు రూ.2.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన ఏటా పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు రూ.27.60 కోట్లు వెచ్చిస్తున్నారు. సాధారణ రహదారుల నిర్వహణతో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ.
కీలక మంత్రి పేషీ నుంచి..
గత ప్రభుత్వ హయాంలో ఓ కీలక మంత్రి పేషీ నుంచి వచ్చిన సూచనల మేరకు ఆ ఏజెన్సీలకు బాధ్యతలు దక్కాయనే ఆరోపణలున్నాయి. ఇప్పుడూ అదే సంస్థలను పొడిగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు బల్దియాలోని కొందరు అధికారులు సహకరిస్తుండగా.. ఉన్నతస్థాయి నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. గతంలో కీలక మంత్రి పేషీలో పని చేసిన ఓ అధికారి సిఫారసు మేరకు పలు ప్రాంతాల్లో ఓ ఏజెన్సీని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థలకు చెల్లిస్తోన్న దాని కంటే తక్కువ వ్యయంతో అంతకన్నా మెరుగైన నిర్వహణ చేపట్టవచ్చని పలువురు అధికారులు సూచించినా ఖాతరు చేయకుండా ఏజెన్సీ గడువు పొడిగించారని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలోని ఓ మంత్రి కూడా ఓ ఏజెన్సీ కోసం సిఫారసు చేశారని జీహెచ్‌ఎంసీలో ప్రచారం జరుగుతోంది.
పర్యాటక ప్రాంతం కి.మీలు నెలకు వ్యయం(రూ.లక్షల్లో)
...........................................................................................................................
పైగా టూంబ్స్ 2.9 9.55
చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం,
మక్కా మసీద్, చౌమహల్లా ప్యాలెస్ 13 41.23
గోల్కొండ కోట, బాపూఘాట్ 13.05 41.23
పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ 4 12.67
ఎంజే మార్కెట్, సుల్తాన్‌బజార్
క్లాక్ టవర్, ఎల్‌బీ స్టేడియం 7 22.51
హుస్సేన్‌సాగర్/ట్యాంక్‌బండ్, బిర్లా టెంపుల్,
బిర్లా ప్లానిటోరియం, ఎల్లమ్మ ఆలయం 10.20 34.50
కేబీఆర్ పార్క్, పెద్దమ్మ ఆలయం 16.3 51.81
దుర్గం చెరువు 5.8 41.47
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1.5 5.49
మొత్తం 73.75 2.30
సగటున కిలోమీటర్ వ్యయం - 3.12 లక్షలు
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News