Share News

MLC Kavitha: నేడు హైదరాబాద్‌కు కవిత..

ABN , Publish Date - Aug 28 , 2024 | 07:53 AM

నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ మధ్యాహ్నం 2:45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.

MLC Kavitha: నేడు హైదరాబాద్‌కు కవిత..
BRS MLC Kavitha

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ఎంతో ఉత్కంఠ నడుమ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మంగళవారం బైయిల్‌పై విడుదలయ్యారు. దీంతో 164రోజుల ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ మధ్యాహ్నం 2:45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె తన నివాసానికి చేరుకోనున్నారు. అయితే తమ అభిమాన నేత దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేస్తోంది.


ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. అయితే ఎమ్మెల్సే కవితకు బెయిల్ తెచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఐదు నెలలుగా చేయని ప్రయత్నాలు లేవు. చివరికి విషయం సుప్రీంకోర్టుకు చేరగా.. విచారణ చేసిన ధర్మాసనం ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పూచీకత్తు సమర్పించారు. దీంతో ఆమె విడుదలను అంగీకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలుకు వారెంట్ ఇచ్చింది. దీంతో 164రోజులుగా జైలులో ఉన్న కవిత నిన్న రాత్రి బయటకు వచ్చారు.


మంగళవారం రాత్రి 9గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలలు తర్వాత బయటకు రావడంతో భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, కుమారుడిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె విడుదల సందర్భంగా జైలు వద్దకు మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పుకొచ్చారు. అనంతరం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నేతలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. నిన్న రాత్రి కార్యాలయంలో బస చేసిన వారంతా ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అయితే సీబీఐ కేసు విషయంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ జరిగే విచారణకు కవిత వర్చువల్‌గా హాజరు అవుతారు.

Updated Date - Aug 28 , 2024 | 08:35 AM