Telangana: కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:59 AM
గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు(Telangana Police) గూండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao).. ఓ హెల్త్‌కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడీ చేయించగా.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తలకొండపల్లి మండలంలో..
చితకబాది.. డాక్యుమెంట్లపై సంతకాలు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం
ఆ భూముల విలువ రూ.30 కోట్లు..!
కిడ్నాప్ వెనక.. గత సర్కారులో కీలక నేత
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంకరపల్లి/ఆమన్‌గల్లు): గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు(Telangana Police) గూండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao).. ఓ హెల్త్‌కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడీ చేయించగా.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తలకొండపల్లి మండలంలో ఓ ఏసీపీ, తహసీల్దార్ కిడ్నాపర్లకు సహకరించారు. ఓ వ్యక్తి నుంచి 35 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రభుత్వం మారడంతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆరుగురు నిందితులకు బేడీలు వేయగా.. ఓ ఏసీపీ, తహసీల్దార్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ తతంగం వెనక గత ప్రభుత్వంలోని కీలక నేత హస్తమున్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిల్కూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు.. 2003-14 మధ్య రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలోని సర్వే నంబర్లు 96, 104, 105, 106, 279, 281లో 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎకరా రూ.80 లక్షల నుంచి రూ.కోటి ఉంది. దీంతో.. శ్రీనివా్‌సరాజుతో కలిసి వ్యాపారం చేసిన సూర్యనారాయణరాజు కన్ను ఆ భూములపై పడింది. వాటిని కొట్టేసేందుకు గత ప్రభుత్వంలో ఓ ముఖ్య నేత సహకారంతో శ్రీనివాస్ రాజు కిడ్నాప్‌నకు కుట్రపన్నారు.
ఏసీపీ సహకారం.. ట్రాకర్ ఏర్పాటు..
శ్రీనివా్‌సరాజును కిడ్నాప్ చేసి, డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకోవాలని సూర్యనారాయణరాజు కుట్రపన్నారు. రెక్కీలు వేశారు. శ్రీనివాస్ రాజు సెల్‌ఫోన్ ఆధారంగా.. కదలికలను ట్రాక్ చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ చాంద్‌పాషా సహకారం తీసుకున్నారు. అయితే, సూర్యనారాయణ గ్యాంగ్ ఆ లోకేషన్‌కు చేరుకునేలోపు.. శ్రీనివా్‌సరాజు వెళ్లిపోయేవారు. ఏసీపీ సూచన మేరకు సూర్యనారాయణరాజు ఓ ట్రాకర్‌ను తెప్పించారు. దాన్ని శ్రీనివాస్ రాజు కారుకు అమర్చారు. నవంబరు 15న శ్రీనివా్‌సరాజు కారు(టీఎస్10-ఎఫ్‌సీ6688)లో శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో ఉన్న స్కూల్‌లో కుమారుడిని దింపి వస్తూ.. తండా సమీపంలో ఆగారు. ఫోన్‌లో తన భార్య సుశీలతో మాట్లాడుతుండగా.. సూర్యనారాయణరాజుకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి.. తర్వాతి రోజు వరకు నిర్బంధించి, తీవ్రంగా గాయపరిచారు. నవంబరు 16న శ్రీనివాస్ రాజుకు చెందిన 70 ఎకరాల్లో 35 ఎకరాలకు సంబంధించిన సేల్‌డీడ్‌లను రూపొందించారు. భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడంతో సుశీల అనుమానంతో తనకు వరుసకు అన్నయ్య అయ్యే సుబ్బరాజుకు సమాచారం అందించారు. ఆయన డయల్-100కు ఫోన్ చేసి, ఆ తర్వాత మోకిల ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
రిజిస్ట్రేషన్‌లో తహసీల్దార్ సహకారం..
కిడ్నాపర్లు గాయాలతో ఉన్న శ్రీనివాస్ రాజును భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నవంబరు 16న తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తహసీల్దార్ కట్టా వెంకటరంగారెడ్డి ఎన్నికల విధుల్లో భాగంగా కల్వకుర్తిలో ఉన్నారు. ఆ రోజున రిజిస్ట్రేషన్ కోసం 12 స్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి. సూర్యనారాయణరాజు పనికోసం ఆగమేఘాల మీద కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్.. ఆ ఒక్క రిజిస్ట్రేషన్‌ను పూర్తిచేసి వెళ్లిపోయారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూముల పాస్ పుస్తకం, విక్రేత పాన్, ఆధార్ కార్డులు తప్పనిసరిగా సమర్పించాలి. అవేమీ లేకుండానే శ్రీనివాస్ రాజు భూమిని సూర్యనారాయణరాజు, అతని అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. శ్రీనివాస్ రాజు గాయాలతో ఉన్నా.. ఏం జరిగిందనేది ప్రశ్నించకుండా, మిగతా నిందితులు సంతకాలు పెట్టాలని బలవంతపెడుతున్నా.. తహసీల్దార్ వెంకటరంగారెడ్డి తన పనికానిచ్చారు. దీనిపై తహసీల్దార్‌కు సూర్యనారాయణరాజు నుంచి రూ.10 లక్షలు ముట్టాయనే ఆరోపణలున్నాయి.
కీలక నేత.. దర్యాప్తు నిల్..!
ఈ కిడ్నాప్ పర్వం వెనక గత ప్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత ఉండడంతో.. మోకిల పోలీసులు ఫిర్యాదుపై పెద్దగా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారడం.. గతంలో జరిగిన అక్రమాలను పోలీసులు సీరియ్‌సగా తీసుకుంటుండడంతో శ్రీనివా్‌సరాజు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మోకిల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సూర్యనారాయణరాజు, రుద్రరాజు బలరామరాజు, తూమటి ఉపేందర్‌రెడ్డి, హరికృష్ణ కుమార్, నీలం లక్ష్మీనారాయణ, గోపిలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో నలుగురు సూర్యాపేటకు చెందినవారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏసీపీ చాంద్‌పాషాను ఏ1గా పేర్కొన్నారు ఏసీపీ హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్లు తెలిసింది. ఆయన పరారీలో ఉన్నట్లు మోకిల పోలీసులు చెబుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన తహసీల్దార్ కట్టా వెంకటరంగారెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేశారు. త్వరలో తహసీల్దార్‌ను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ కీలక నేతను కూడా విచారించే అవకాశాలున్నాయి. రిమాండ్‌లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారిస్తే.. మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. తాను స్లాట్ బుకింగ్ మేరకే రిజిస్ట్రేషన్ చేశానని, కిడ్నాప్ విషయంలో తనకేమీ తెలియదని తహసీల్దార్ పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..