Share News

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ టూర్ వివరాలు.. వెళ్తే తప్పక ఇవి చూడండి..

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:18 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్దఎత్తున జలాశయానికి నీరు చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ టూర్ వివరాలు.. వెళ్తే తప్పక ఇవి చూడండి..

నాగార్జునసాగర్: వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్దఎత్తున జలాశయానికి నీరు చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. దీంతో పలు గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే డ్యామ్ సహా చుట్టుపక్కల దృశ్యాలు చూసేందుకు ప్రకృతి ప్రేమికులు భారీగా వస్తుండడంతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది.


Nagarjun-sagar-4.jpg

నాగార్జునసాగర్ జలాశయం, కొండ, సమీపంలోని ఎత్తిపోతల జలపాతాలు, బుద్ధవనం వంటి ప్రదేశాలు చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం అందంగా, ఆకర్షణీయంగా ఉండడంతో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా డ్యామ్ పరిసర అందాలు, బ్యాక్ వాటర్ బ్యూటీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీడెంట్ లేదా సెలవులు పెట్టి మరీ భారీగా ప్రజలు వస్తుండడంతో ప్రభుత్వం ప్రత్యేక బస్సుల ద్వారా ఒక్క రోజు టూర్ ప్లాన్ చేసి ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి తెచ్చింది.


టూర్ వివరాలు..

నాగార్జునసాగర్ డ్యామ్, చుట్టుపక్కల ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి కేవలం ఒక్కరోజులో వెళ్లిరావచ్చు. దీనికి తెలంగాణ టూరిజం శాఖ పత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. సాగర్ వెళ్లేందుకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 7:30గంటలకు సికింద్రాబాద్‌లోని పర్యాటక భవన్ నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11:30గంటల కల్లా బస్సు నాగార్జునసాగర్ డ్యామ్ వద్దకు చేరుకుంటుంది. బుద్ధవనం సందర్శించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది. అనంతరం 2నుంచి 4గంటల వరకు బోటింగ్, మ్యూజియం, సాగర్ కొండ, డ్యామ్ వ్యూవ్ పాయింట్ చూడొచ్చు. ఆ తర్వాత సాయంత్రం 5గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 9గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇందుకు పిల్లలకు రూ.640, అలాగే పెద్దలకు రూ.800 టికెట్ ధర తీసుకుంటారు. భోజనం, బోటింగ్, ఎంట్రీ టికెట్లు వంటి ఇతర ఖర్చులు అన్నీ మనమే భరించాల్సి ఉంటుంది.


ఏమేమి చూడొచ్చు..

ముందుగా నాగార్జునసాగర్ డ్యామ్ చూడొచ్చు. భారీగా స్టోరైన నీరు, గేట్లు ఎత్తడంతో పెద్దఎత్తున కింద పడే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. తెల్లటి రంగులో పెద్దఎత్తున పాలధార పడుతుందా అన్నట్లు దాని సోయగం ఉంటుంది. అలాగే నది మధ్యలో ఉండే నాగార్జున కొండను చూసేందుకు లాంచీలో వెళ్లాలి. టూరిస్టులను తీసుకెళ్లేందుకు ఆంధ్ర, తెలంగాణ టూరిజం బోటింగ్ సెంటర్లు అక్కడ సిద్ధంగా ఉంటాయి. కొండను చేరుకునేందుకు సుమారు గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి సోయగాలు మనసుని కట్టిపడేస్తాయి. కొండ వద్ద మనకు బౌద్ధకాలం నాటి ఆనవాళ్లు దర్శినమిస్తాయి. అక్కడ ఉండే మ్యూజియంలో స్థానికంగా దొరికిన పురాతన విగ్రహాలు, వస్తువులు ప్రదర్శనకు ఉంటాయి.

night water falls.jpg


నాగార్జునసాగర్ డ్యామ్ చూసిన తర్వాత లాంచీ ద్వారా పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వెళ్లొచ్చు. నల్లమల అడవులు, కొండ కోనల మధ్య సాగే ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. ఎక్కువ మంది ఈ జర్నీ చేసేందుకు ఇష్టపడతారు. ఇక్కడ కనిపించే దృశ్యాలు మనం వేరేదైనా లోకంలో ఉన్నామా అనేంత అద్భుతంగా ఉంటాయి. బోటింగ్ చేయాలని అనుకుంటే నీటి ప్రవాహాన్ని బట్టి అధికారులు అనుమతి ఇస్తారు. ప్రవాహం తీవ్రంగా ఉంటే బోటింగ్ చేసేందుకు అవకాశం ఉండదు.

srisailam.jpg


నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి ఎత్తిపోతల జలపాతాలు సుమారు 15కి.మీ. దూరంలో ఉంటాయి. చంద్ర వంక వాగు, నక్కల వాగు, తుమ్మల వాగుల మూడు కలిసి ప్రవహించి సాగర్ జలాల్లో కలవడం వల్లే దీనికి ఎత్తిపోతల జలపాతం అని పేరు వచ్చింది. డ్యామ్ చూసేందుకు వచ్చిన పర్యాటకులు వాటర్ ఫాల్స్ చూడకుండా వెళ్లారంటే చాలా మిస్ అయినట్లే. అంత అద్భుతంగా ఉంటాయి మరి. అయితే ఈ వాటర్ ఫాల్స్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల పర్యాటకులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచినీరు, బ్యాటరీ లైట్లు, మీకు కావాల్సిన ఇతర సామగ్రి వెంట తీసుకెళ్లాలి. అలాగే అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. మరింకెందుకు ఆలస్యం వెంటనే టూర్‌కి ప్లాన్ చేయండి. ఇప్పుడు మిస్సయ్యారంటే ఈ అందాలు చూసేందుకు మళ్లీ ఏడాది పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

Updated Date - Aug 09 , 2024 | 01:18 PM