Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి..
ABN , Publish Date - Nov 27 , 2024 | 07:24 AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంతరావు(వీహెచ్) కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనంతో తన కారును ఢీకొట్టినట్లు వీహెచ్ తెలిపారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంతరావు(వీహెచ్) కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ అంబర్‌పేటలోని తన ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారును గుర్తుతెలియని వాహనంతో ఢీకొట్టినట్లు వీహెచ్ తెలిపారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులు పారిపోయినట్లు ఆయన చెప్పారు. తనపై ఇలా దాడి జరగడం రెండోసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును దుండగులు మరో వాహనంతో ఢీకొట్టి పారిపోయారని పోలీసులకు వీహెచ్ తెలిపారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దాడి వెనక కారణాలను సైతం కనుగొనాలని వీహెచ్ కోరారు. అనంతరం దాడికి గురైన కారును పోలీసులు పరిశీలించారు. చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి వీహెచ్‌కు చెప్పారు.
కాగా, వి.హనుమంతరావు కారుపై గతంలోనూ దాడి జరిగింది. 14, ఏప్రిల్ 2022న అర్ధరాత్రి సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వీహెచ్ కారుపై దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో అద్దాలు ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. వీహెచ్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందిన వికాస్‌సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది: కేటీఆర్..
Health News: చలికాలం కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే న్యాచురల్ రెమిడీస్ ఇవే..