Share News

Bhatti Vikramarka: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ టాప్‌

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:45 AM

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ దేశంలోనే ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ టాప్‌

  • స్థిరాస్తి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

  • మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక టవర్లు

  • నరెడ్కో ప్రొపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ దేశంలోనే ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ఇటీవల విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నరెడ్కో(నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రొపర్టీ షోను డిప్యూటీ సీఎం భట్టి శనివారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. హైడ్రా కూల్చివేతలపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు.


అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. ఇక, మూసీ నిర్వాసితులకు మెరుగైన జీవితం ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మూసీ నిర్వాసితుల కోసం వారు ప్రస్తుతమున్న ప్రాంతంలోనే టవర్లు నిర్మించి ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు, నిర్వాసితుల పిల్లల కోసం ఇంటి గ్రేటేడ్‌ పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.10వేల కేటాయించామంటే నగరాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం అర్థం చేసుకోవాలని అన్నారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్‌ రోడ్డు, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ వస్తున్నాయని వెల్లడించారు. ఫ్యూచర్‌ సిటీలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, క్రికెట్‌ స్టేడియం, ఏఐ ప్రాజెక్టులు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో అధ్యక్షుడు మేక విజయసాయి, ప్రతినిధులు కిరణ్‌, కాళిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 04:45 AM