AV Ranganath: అలసత్వం వద్దు.. అన్ని ఫిర్యాదులను పరిశీలించాలి
ABN , Publish Date - Aug 31 , 2024 | 03:47 AM
వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు.
ఇబ్బందులు లేనిచోట ఆక్రమణలను తొలగించాలి
అధికారులతో సమీక్షలో రంగనాథ్
వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు. ఇప్పటిదాక వచ్చిన వినతులు.. వాటిలో ఏ విభాగానివి ఎన్ని ? పరిశీలించినవి ఎన్ని..? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బుద్ధ భవన్‌లోని కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం సాగింది. రంగనాథ్ ప్రతి ఫిర్యాదు పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
చెరువులతో పాటు నాలాలు, రోడ్లపై ఆక్రమణల గురించి విన్నపాలు వస్తున్నాయని పేర్కొన్నారు. చెరువుల్లో ఆక్రమణల నిర్ధారణకు సమయం పడుతుందని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని చోట నాలాలు, రోడ్లపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని రంగనాథ్ ఆదేశించినట్లు తెలిసింది. కాగా, విపత్తుల నిర్వహణపైనా ఆయన సమీక్షించారు.
వర్షాల సమయంలో వచ్చేవాటిపై ఎంత సమయంలో స్పందిస్తున్నారు..? సమస్య పరిష్కారం ఎప్పుడు జరుగుతుందన్నది ఆరా తీశారు. స్వయంగా కొందరు ఫిర్యాదుదారులకు ఫోన్లు చేసి మాట్లాడారు. ప్రతి నెలా ఫిర్యాదులు, పురోగతిపై సుదీర్ఘ సమీక్ష ఉంటుందని.. చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు.