Elevated Corridor Project: కొడంగల్ ఎత్తిపోతలకు తక్షణమే టెండర్లు
ABN , Publish Date - Jul 19 , 2024 | 03:33 AM
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం పురోగతిపై ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి తాను సమీక్ష చేస్తానని చెప్పారు.
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
3,4 వారాలకోసారి సమీక్షిస్తానని వెల్లడి
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం పురోగతిపై ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి తాను సమీక్ష చేస్తానని చెప్పారు. గురువారం తన నివాసంలో ఈ పథకంపై నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై రేవంత్ ఆరా తీయగా.. ప్రస్తుతం డిజైన్లను తయారు చేస్తున్నామని, త్వరలోనే తుదిరూపు ఇస్తామని అధికారులు చెప్పారు.
ఒక వైపు డిజైన్లు సిద్ధం చేస్తూ.. మరోవైపు పనుల కోసం టెండర్లు పిలవాలని సీఎం నిర్దేశించారు. ఇక భూత్పూరు జలాశయం నుంచి ఈ పథకానికి నీటిని తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 4.02 టీఎంసీలను నిల్వ చేసేలా ఈ ప్రాజెక్టు కింద జలాశయాలు నిర్మించనున్నారు. అలాగే, కొడంగల్‌లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మద్దూరు గురుకుల క్యాంపస్ నిర్మాణంపైనా పలు సూచనలు చేశారు.