Hayathnagar: ఒక్కడు కాదు నలుగురు హంతకులు
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:09 AM
సంచలనం సృష్టించిన హయత్‌నగర్ వ్యాపారి కాశీరావు(37) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. కాశీరావును హత్య చేసింది ఒక్కడు కాదని, నలుగురు కలిసి ముందస్తు పధకం ప్రకారం ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు.

అప్పు ఎగ్గొటేందుకే పథకం ప్రకారం ఖూనీ
హయత్‌నగర్ వ్యాపారి హత్య కేసు నిందితుల అరెస్టు
హయత్‌నగర్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన హయత్‌నగర్ వ్యాపారి కాశీరావు(37) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. కాశీరావును హత్య చేసింది ఒక్కడు కాదని, నలుగురు కలిసి ముందస్తు పధకం ప్రకారం ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఐతరాజు శంకర్, పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి కాశీరావు ప్రసన్న కుమార్ అనే నలుగురిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కాశీరావు వద్ద చేసిన అప్పును ఎగ్గొట్టేందుకు నిందితులు అతని కళ్లలో పెప్పర్ స్ర్పే కొట్టి, సర్జికల్ బ్లేడ్‌తో పీక కోసి ప్రాణం తీసినట్టు పోలీసు విచారణలో తేలింది. ఐతరాజు శంకర్ ఒక్కడే హత్య చేశాడని తొలుత భావించినా... దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది.
హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని దోనకొండకు చెందిన కాశీరావు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చి వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ హయత్‌నగర్ ప్రాంతంలోని భాగ్యలత అరుణోదయనగర్ కాలనీలో స్థిరపడ్డాడు. యాదాద్రి జిల్లా అంతమ్మగూడెంకు చెందిన ఐతరాజు శంకర్, గట్టప్పల్‌కు చెందిన పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి.. కాశీరావు ఇంటి పైవాటాలో అద్దెకు ఉంటున్నారు. హయత్‌నగర్‌కు చెందిన ప్రసన్న కుమార్‌తో కలిసి ఈ ముగ్గురు బొమ్మలగుడి వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాశీరావు వద్ద నలుగురూ కలిసి రూ.23.30లక్షలు (శంకర్- రూ. 5లక్షలు, శేఖర్ 5.10లక్షలు, సాయి 10 లక్షలు, ప్రసన్న-3.30 లక్షలు) అప్పు చేశారు. రెండేళ్లు గడిచినా అప్పు తీర్చకపోవడంతో కాశీరావు ఈ నలుగురిని డబ్బు కోసం ఒత్తిడి చేసేవాడు. హయత్‌నగర్ పాతరోడ్డులో 22 గజాల్లో ఉన్న ప్రసన్నకుమార్‌కు చెందిన షెట్టర్లను తన అప్పు కింద కాశీరావు స్వాధీనం చేసుకున్నాడు. దీంతో, కోపంతో నలుగురు పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారు.