Khammam: ఇంట్లో బురద.. బయట వాన
ABN , Publish Date - Sep 05 , 2024 | 05:21 AM
ఇంట్లో బురద.. బయట వాన! ఇంట్లో ఉండలేరు.. ఆరుబయట నిలవలేరు!! ఇదీ ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి.
ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి
బురద కారణంగా వీధుల్లో దుర్వాసన.. ఇంట్లో ఉండలేరు.. బయట తిరగలేరు
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు.. ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి 5 లక్షల దాకా నష్టం
ఖమ్మం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇంట్లో బురద.. బయట వాన! ఇంట్లో ఉండలేరు.. ఆరుబయట నిలవలేరు!! ఇదీ ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న వేలాది కుటుంబాలు.. వరద తగ్గినా బురద కారణంగా ఇంకా కోలుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారి అసలే కంపు కొడుతున్నాయి! దీనికి తోడు బుధవారం మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మున్నేరు బాధితుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారంతా మళ్లీ సాధారణ జీవనం గడపాలంటే నెలరోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మున్నేరు వరద బాధితుల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గోడే వినిపిస్తోంది.
ప్రతి ఇంటికి కనీసం లక్ష నుంచి రూ.5లక్షల వరకు నష్టం జరిగిందంటే మున్నేరు వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద తాకిడికి నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ధంసలాపురం, కాల్వొడ్డు, మమతారోడ్డు, కవిరాజనగర్, జూబ్లీక్లబ్ ఏరియాతో పాటు ఖమ్మంరూరల్ మండలంలోని పెద్దతండా, కరుణగిరి, జలగంనగర్, రాజీవ్‌గృహకల్ప, రామన్నపేట, దానవాయిగూడెం తదితర కాలనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోటరీ నగర్, కవిరాజ నగర్, చైతన్య నగర్, మామిళ్లగూడెం, పాండురంగాపురం కాలనీలు కొంత కోలుకున్నా.. కాల్వొడ్డు, బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, మంచికంటినగర్, ధంసలాపురం, ఖమ్మంరూరల్ మండలం పెద్దతండా తదితర కాలనీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది.
భారీగా నష్టం..
మున్నేరు వరదతో పరివాహక ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లింది. కొన్ని ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. కొన్ని ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో దుస్తులు, దుప్పట్లు, సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు, దస్ర్తాలు, నిత్యావసర సామగ్రి, వస్తువులు పూర్తిగా బురదమయంఅయ్యాయి! బురదకు నాని దుస్తులు కంపు కొడుతుండడంతో కొందరు వాటిని ఉతకలేక పారేస్తున్నారు. ఇలా బయట పారేసిన వస్త్రాలతో పరిసరాలన్నీ మరింత దుర్గంధభరితంగా మారాయి. ప్రభుత్వం, అధికారులు వీలైనంత వేగంగా స్పందించి రోడ్లపై బురదను తొలగించాలని బాధిత కాలనీలవాసులు వేడుకుంటున్నారు.
హోటల్, ఇల్లు నాశనమయ్యాయి
ఎఫ్‌సీఐ గోదాం వద్ద హోటల్ నడుపుకొంటూ జీవిస్తున్నాం. వరదకు హోటల్ కూలిపోయింది. ఇల్లంతా బురదమయం అయ్యింది. వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. దాదాపు రూ.5లక్షల దాకా నష్టం జరిగింది. పిల్లాపాపలతో ప్రశాంతంగా ఉంటున్నాం. ఇలా జరుగుతుందని ఏన్నడూ ఊహించలేదు. మున్నేరు వరద వస్తుందని తెలియగానే తెల్లవారుజామునే పిల్లలను తీసుకొని వెళ్లిపోయాం. ఇప్పుడు వచ్చి చూస్తే అంతా బురదే ఉంది.
- తోట సంధ్య, పద్మావతినగర్
మా ఇల్లే పోయింది.. ఉండేదెట్లా
ఆదివారం తెల్లవారుజామన 4గంటలకు మున్నేరు వరద వచ్చి పడింది. వెంటనే బజారులోకి పరుగు తీశాం. కట్టుబట్టలతోనే బయటకు వెళ్లాం. వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే అసలు ఇల్లే లేదు. రేకులషెడ్డుతో ఉన్న ఇల్లు కూలిపోయింది. దుస్తులు, సామగ్రి కొట్టుకుపోయాయి. నా కొడుకు గుండెజబ్బుతో చనిపోయాడు. కోడలు, మనవలతో కలిసి ఉంటున్నా. మేం ఇద్దరం ఆడవాళ్లం.. పిల్లలతో ఎలా బతకాలో అర్ధం కావడంలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
- ఆర్.పుణ్యవతి, పద్మావతినగర్
పిల్లల సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి
మిర్చి మార్కెట్‌లో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఉన్నంతలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని మున్నేరు వరద కన్నీటిపాలు చేసింది. పై అంతస్తులో దుస్తులు పెడితే అక్కడికి కూడా వరద వచ్చింది. ఆదివారం ఉదయం 7గంటలకే వరద రావడంతో అందరం కట్టుబట్టలతోనే బయటపడ్డాం. ఇంట్లో అన్ని వస్తువులూ నాశనం అయ్యాయి. పిల్లల సర్టిఫికెట్లన్నీ వరదపాలయ్యాయి. పునరావాస కేంద్రంలోనూ ఉండలేకపోతున్నాం. మాకు సుమారు రూ.5 లక్షల దాకా నష్టం జరిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- ఫరీదా, కాల్వొడ్డు వాసి