వాజ్‌పేయి అజాత శత్రువు
ABN , Publish Date - Dec 25 , 2024 | 03:34 AM
అటల్ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప నేత
ఆయన జీవితం భావితరాలకు డిక్షనరీ
వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో కిషన్‌రెడ్డి
వాజ్‌పేయి స్థితప్రజ్ఞుడు: విద్యాసాగర్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అటల్ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన జీవిత చరిత్ర భావితరాలకు ఒక డిక్షనరీ అని వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని సైతం తృణప్రాయంగా వదులుకుని నైతిక విలువలకు పట్టం గట్టిన గొప్ప నేత వాజ్‌పేయి అని కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం తాజ్ దక్కన్‌లో ఏబీవీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. 1999 ఏప్రిల్‌లో పార్లమెంటులో విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ ఫిరాయించి వచ్చేందుకు ఎంతోమంది ఎంపీలు సంసిద్ధత వ్యక్తం చేసినా, ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదని, అలాంటి పద్ధతిలో ఎవరినీ తీసుకోవద్దని వాజ్‌పేయి స్పష్టం చేశారని గుర్తుచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నానని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. వాజ్‌పేయికి ఆయన వ్యక్తిత్వంతోనే గౌరవం దక్కిందన్నారు. ‘‘పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంలో నేను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాను.
అంతటి ఉద్రిక్త పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆలోచించి వాజ్‌పేయి నిర్ణయాలు తీసుకున్నారు. మన ప్రజాస్వామ్యం ఓడిపోదు. మరుసటి రోజు పార్లమెంటు జరగాలి అని స్పష్టం చేశారు. వాజ్‌పేయి స్థితప్రజ్ణతకు ఇది నిదర్శనం’’ అని విద్యాసాగర్‌రావు వివరించారు. ప్రజా నాయకులుగా ఎదిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రమే అని బీజేపీ జాతీయ అఽధికార ప్రతినిధి, ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు. వాజ్‌పేయి హయాంలో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. కాగా, వాజ్‌పేయి జీవితానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.