Hyderabad: తెలంగాణలో మళ్లీ చీకట్లు :కేటీఆర్
ABN , Publish Date - Jun 02 , 2024 | 04:40 AM
తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలపై పలువురు నెటిజన్లు ఎక్స్‌లో చేసిన పోస్టులను కేటీఆర్.. ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు.
గతంలో విద్యుత్ కోతలే లేకుండా పవర్ సెక్టార్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని విమర్శించారు. ‘2014కు ముందు తరుచూ విద్యుత్ కోతలు, పవర్ హాలీడేస్ మనకు తెలిసిందే. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌ది. 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయటం కారణంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. తరుచూ విద్యుత్ కోతలతో అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలకు ఇబ్బంది తీసుకొస్తోంది. కేసీఆర్ పాలనలో పవర్ హాలీడేస్ అనే మాటే లేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.