KTR: కుర్‌కురే బీజేపీ.. కిరికిరి కాంగ్రెస్
ABN , Publish Date - May 08 , 2024 | 04:55 AM
కుర్‌కురే బీజేపీ.. కిరికిరి కాంగ్రెస్ ఓ పక్క.. తెలంగాణ కోసం పేగులు తెగేదాక కొట్లాడిన బీఆర్‌ఎస్ ఒక పక్క ఉన్నయి.
ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ భావిస్తోంది
టీవీలో రేవంత్ మాటలను కుటుంబంతో కలిసి చూడలేం
సికింద్రాబాద్ రోడ్‌షోలో కేటీఆర్
హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర, మే 7 (ఆంధ్రజ్యోతి): ‘కుర్‌కురే బీజేపీ.. కిరికిరి కాంగ్రెస్ ఓ పక్క.. తెలంగాణ కోసం పేగులు తెగేదాక కొట్లాడిన బీఆర్‌ఎస్ ఒక పక్క ఉన్నయి. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌పై పట్టు దొరకని బీజేపీ.. ఎన్నికల తర్వాత నగరాన్ని ఢిల్లీ తరహాలో కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తోందని, దీనిని అడ్డుకోవాలంటే లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి టీ పద్మారావుగౌడ్‌కు మద్దతుగా అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ‘ఇవి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు కదా.. బీఆర్‌ఎస్ గెలవడం ఎందుకని కొందరంటున్నరు.
గతంలో ఐదు మంది ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చారు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామరక్ష’ అని చెప్పారు. ఐదేళ్లలో కిషన్‌రెడ్డి అంబర్‌పేటకు చేసిందేమిటని.. ఒక గుడి కట్టిండా? బడి కట్టిండా? ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. టీవీల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట లను కుటుంబసభ్యులతో కలిసి చూసే పరిస్థితి లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హామీల అమలుపై విమర్శలు గుప్పిస్తూ, రూ.లక్షన్నర నగదు, తులం బంగారం బాకీ ఉన్నవ్.. ఇయ్యకపోతే ఆడపిల్లలు నీ లగ్గం చేస్తారని రేవంత్‌ను హెచ్చరించారు. బీఆర్‌ఎ్‌సకు 10-12 సీట్లు ఇస్తే.. ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. అంబర్‌పేటలో రోడ్ షో జరుగుతుండగానే వర్షం కురవటంతో వానలోనే ప్రసంగించిన కేటీఆర్.. ఖైరతాబాద్ రోడ్ షోను రద్దు చేసుకున్నారు.
తెలంగాణకు ఏమిచ్చారు..?
ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్నల వర్షం
‘‘తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు మరిచారు..? పదేళ్లలో ప్రధానిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి..’’ అంటూ ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు బొందపెట్టారు..?కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా.. తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు..? 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏం చేశారు..? తెలంగాణలో ప్రజా చైతన్యం ఎక్కువ. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.