Share News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌, భూ ఆక్రమణ కేసుల్లోనాటి నేతలపై నజర్‌!

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:08 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత మార్చిలో నమోదైన ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌, భూ ఆక్రమణ కేసుల్లోనాటి నేతలపై నజర్‌!

  • అధికారులకు ఆదేశాలిచ్చిన వారికి నోటీసులు

  • కేసుల నమోదు.. రాజకీయ కోణంలో దర్యాప్తు

  • ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రధాన నిందితుడిని

  • అమెరికా నుంచి రప్పించేందుకు యత్నాలు

  • భూ బదలాయింపు వ్యవహారంలో ప్రస్తుత,

  • మాజీ ఐఏఎస్‌ అధికారుల ప్రమేయం!

  • ఈడీకి అమోయ్‌ కుమార్‌ బాధితుల క్యూ

  • తాజాగా వట్టినాగులపల్లివాసుల ఫిర్యాదు

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత మార్చిలో నమోదైన ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతోపాటు మరో వ్యక్తి కోసం చట్టపరంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో వందలాది మంది సాక్షులను విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. దర్యాప్తులో లభించిన సమాచారంతో త్వరలోనే రాజకీయ నాయకుల కోణంలో విచారణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవల అధికార పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌తో ప్రమేయం ఉన్న అప్పటి అధికార పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.


కేసు నమోదైనప్పటి నుంచి విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్‌రావును వీలైనంత త్వరగా రప్పించడంపై అధికారులు దృష్టి సారించారు. అందుకు అవసరమైన అన్ని మార్గాల్లో ముందుకెళ్తున్నారు. గతంలో కీలక కేసుల్లో విదేశాల్లో నక్కిన వారిని వెనక్కు రప్పించడంలో అనుసరించిన విధానాలపై అనుభవం ఉన్న అధికారులు ఇప్పుడు అదే పద్ధతిలో ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ తర్వాత కీలకమైన భూ బదలాయింపుల కేసులో ఇప్పటికే ఈడీ దూకుడుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.


వందల కోట్ల అక్రమాలకు సంబంధించి సీనియర్‌ ఐఏఎ్‌సకు ఈడీ సమన్లు జారీ చేసి సుదీర్ఘంగా విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది. ఈ కేసులో ప్రస్తుత, మాజీ ఐఏఎ్‌సల పేర్లు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటి నాయకులపై సైతం కేసులు పెట్టే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. న్యాయనిపుణులు, ఇతర ముఖ్యుల సలహాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ కేసుల్లో మరికొద్ది రోజుల్లోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా కేసుల్లో ఇప్పటివరకు అధికారుల చుట్టూ తిరిగిన దర్యాప్తు ఇకపై నాయకుల చుట్టూ తిరగనుంది.


  • అమోయ్‌పై ఫిర్యాదులకు క్యూ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌పై ఈడీ అధికారులకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అవినీతిపై నిగ్గుతేల్చి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు బషీర్‌బాగ్‌లోకి ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. మొన్న తట్టిఅన్నారం బాధితులు ఈడీకి ఫిర్యాదు చేయగా తాజాగా గండిపేట్‌ మండలం వట్టినాగులపల్లి నుంచి బాధితులు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలంలో భూ బదలాయింపుల కేసులో ఈడీ అధికారులు అమోయ్‌ కుమార్‌కు సమన్లు జారీ చేశారు. వరుసగా మూడు రోజులు విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. శుక్రవారం ఈడీ కార్యాలయంలో అమోయ్‌ కుమార్‌ను అధికారులు విచారిస్తున్న సమయంలోనే అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారం గ్రామంలోని సర్వే నెంబర్లు 108, 109, 110, 111లోని 70 ఎకరాల 39 గుంటల భూమి విషయంలో అక్రమాలు జరిగాయని బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు.


దాన్ని ఈడీ అధికారులు పరిశీలిస్తున్న క్రమంలో తాజాగా శనివారం మరో ఫిర్యాదు అందింది. వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్‌ ప్లాట్స్‌ పర్చేజర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఈడీకి ఫిర్యాదు చేశారు. అసోసియేషన్‌ సభ్యులు లక్ష్మీకుమారి, కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1983లో వట్టినాగులపల్లిలోని 460 ఎకరాల్లో 3,333 వరకు ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. ఇందులో 3,228 మంది యజమానులను వారు కొన్న ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా వ్యవసాయ భూమిగా చిత్రీకరించారని తెలిపారు. తమ పేరుతో ఉన్న భూముల్ని బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కట్టబెట్టారని, అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతోనే కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ స్థలాల బదలాయింపు చేశారన్నారు. ఇలా వరుసగా రోజుకొకరు చొప్పున బాధితులు ఈడీ కార్యాలయానికి వస్తుండటంతో ఈ కేసుల్లో ఎప్పుడు, ఎవరికీ ఈడీ నోటీసులు అందుతాయోననే పరిస్థితి నెలకొంది. మూడు రోజులు సుమారు 20గంటల పాటు అమోయ్‌ను విచారించిన ఈడీ విచారించగా.. త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Oct 27 , 2024 | 04:08 AM