Seethakka: పాలను సరఫరా చేయగలరా..? లేదా..?
ABN , Publish Date - Dec 01 , 2024 | 03:48 AM
‘‘అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మేర పాలను ఇవ్వగలరా.. లేదా.? ప్రభుత్వం కోరినంత సరఫరా చేసేంత సామర్థ్యం ఉందా.. లేదా..? డిమాండ్‌కు అనుగుణంగా పాలను పంపించే శక్తి లేకపోతే..

మూడు నెలలు అవకాశం ఇస్తున్నాం
అప్పటికీ మారకపోతే కఠిన చర్యలు
విజయ డెయిరీకి మంత్రి సీతక్క హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మేర పాలను ఇవ్వగలరా.. లేదా.? ప్రభుత్వం కోరినంత సరఫరా చేసేంత సామర్థ్యం ఉందా.. లేదా..? డిమాండ్‌కు అనుగుణంగా పాలను పంపించే శక్తి లేకపోతే.. ప్రస్తుతం మీకు ఇస్తున్న ఆర్డర్‌లో కొంత తగ్గించి ఇతర సంస్థల ద్వారా సేకరించమంటారా..?’’ అని విజయ డెయిరీ ప్రతినిధులను మంత్రి సీతక్క ప్రశ్నించారు. మరో మూడు నెలల పాటు అవకాశం ఇస్తున్నామని, అప్పటి వరకు పాల సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆ తర్వాత కూడా పాల సరఫరా సంతృప్తికరంగా లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 1.67 కోట్ల లీటర్ల పాల కోసం ఆర్డర్ చేయగా 1.56 కోటి లీటర్లనే విజయ డెయిరీ సరఫరా చేయగలిగిందన్నారు.
కొన్ని అంగన్ వాడీ సెంటర్లకు సకాలంలో పాలు సరఫరా కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకంపై శనివారం మంత్రి సీతక్క సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలను సీతక్క తాగారు. పాల నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. సరఫరా విషయంలో అలసత్వం వహించొద్దని అన్నారు. కాగా, అంగన్‌వాడీలకు రూ.57కి లీటరు పాలను అందిస్తున్నామని, ధరలను సవరించాలని విజయ డెయిరీ ప్రతిపాదించగా.. మంత్రి తిరస్కరించారు. మూడు నెలలు అంతరాయం లేకుండా పాలను సరఫరా చేసిన తర్వాత, మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.