Nagarjuna Sagar: సాగర్.. ఫుల్!
ABN , Publish Date - Aug 15 , 2024 | 03:54 AM
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పూర్తి స్థాయి సామర్థ్యానికి ప్రాజెక్టు
రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
తుంగభద్ర వద్ద నేడే స్టాప్‌లాగ్ బిగింపు
నాగార్జునసాగర్/గద్వాల, ఆగస్టు 14: ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 590 అడుగులకు (312 టీఎంసీలకు) చేరుకుంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 68,483 క్యూసెక్కులు వస్తుండగా.. 2 గేట్లు, జల విద్యుత్పత్తి, కాల్వలకు 63,123 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది. కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు వరదలు తగ్గాయి.
ఆల్మట్టిలో 123 టీఎంసీలకు 121.26 టీఎంసీలకు నిల్వ చేరింది. 30,648 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా జల విద్యుదుత్పత్తి ద్వారా15 వేల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లో 33.31 టీఎంసీలకు.. ప్రస్తుతం 33.12 టీఎంసీలున్నాయి. 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుదుత్పత్తి కోసం 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాలలో 9.31 టీఎంసీలుండగా.. 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జల విద్యుదుత్పత్తి ద్వారా 32,871 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ఇక తుంగభద్ర డ్యామ్‌కు 35,425 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 19వ గేటు కొట్టుకుపోవడంతో దానితో పాటు మరికొన్ని గేట్లు ఎత్తడంతో పాటు విద్యుదుత్పత్తి కోసం 1,20,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు 1,39,796 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 68,453 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు 192.53 టీఎంసీలున్నాయి.
నేడే స్టాప్‌లాగ్ బిగింపు..
తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. స్టాప్‌లాగ్ సెగ్మెంట్లను డ్యామ్‌పైకి చేర్చేందుకు అవసరమైన రెండు భారీ క్రేన్లు (ఒక్కోటీ 50 టన్నులు), ఇనుప యాంగ్లర్స్, హైడ్రో పాలీ ఫింగర్స్, ఇతర యంత్రసామగ్రిని అక్కడకు తరలించారు. స్టాప్‌లాగ్ ఏర్పాటు క్రమంలో డ్యాంపై ఒత్తిడి పడకుండా ప్రత్యేకంగా ఫుట్‌పాత్ ట్రాక్‌ను నిర్మించారు.
గురువారం మధ్యాహ్నం నుంచి ఐదు స్టాప్‌లాగ్ సెగ్మెంట్లను ఒకదానిపై మరొకటి దించి వెంటనే వెల్డింగ్ చేసేస్తారు. గురువారం సాయంత్రానికి స్టాప్‌లాగ్ అమరిక ప్రక్రియ పూర్తవుతుందని ఏపీ జలవనరుల శాఖ అధికారులు ధీమాగా చెబుతున్నారు.