ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:26 AM
ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూ ర్తిచేశారు. ప్రథమ సంవత్సరం 28న, ద్వితీయ సంవత్సరం 29న నిర్వహించే పరీక్షలకు 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఈ నెల 28 నుంచి మార్చి 19వరకు పరీక్షలు
పరీక్ష కేంద్రాల పరిధిలో 144సెక్షన్ అమలు
నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రానికి నోఎంట్రీ
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 24: ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూ ర్తిచేశారు. ప్రథమ సంవత్సరం 28న, ద్వితీయ సంవత్సరం 29న నిర్వహించే పరీక్షలకు 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 6,109, ద్వితీయ సంవత్సరం 6,450 మంది విద్యార్థులు 20 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలలు మొత్తం 30 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 8.45గంటల వరకు విద్యార్థులు కేంద్రాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. కళాశాల యాజమాన్యాలు ఫీజు వసూలుకు ఒత్తిడి చేయకుండా హాల్ టికెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తారు.
ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు
నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ఉదయం 6గంటల నుంచే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలపై జిల్లాస్థాయిలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా కలెక్టర్ ఉండనుండగా, పరీక్షల నిర్వహణకు 30మంది సెంటర్ ఇన్‌చార్జీలు (సీఎస్), 70మంది డిపార్ట్‌మెంట్ అధికారులు (డీవో)లను నియమించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 2 సిట్టింగ్ స్క్వాడ్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తారు. 11 స్టోరేజీ పాయింట్లలో ప్రశ్నపత్రాలు భద్రపరిచారు.
అందుబాటులో సదుపాయాలు
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రథమ చికిత్స అందించేందుకు ప్రతీ పరీక్ష కేంద్రంవద్ద ఏఎన్‌ఎంను నియమించగా, నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు తేవొద్దని, ఒకవేళ తెచ్చినా మొబైల్ పాయింట్ కేంద్రాల్లో భద్రత పర్చాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమతించేదిలేదు. కమిటీ సభ్యులు సహా, ఇతర అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు లోనికి తీసుకురావొద్దు. మాస్ కాపీయింగ్ పాల్పడినా, ఒకవేళ ఎవరి దృష్టికి వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుందని, జీరాక్స్ కేంద్రాలు మూసివేయాలని డీసీపీ రాజే్‌షచంద్ర ఆదేశించారు.
కఠిన చర్యలు తప్పవు : సీ.రమణి, ఇంటర్మీడియట్ నోడల్ అఽధికారి,యాదాద్రి
కమిటీ సభ్యులు సహా ఇన్విజిలేటర్లు, సిబ్బంది, ఇతరులు ఎవరూ పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ వస్తువులు తీసుకెళ్లవద్దు. అలాగే మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించం. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు ఒత్తిళ్లకు గురికాకుండా నిజాయితీ తో పరీక్షలు రాయాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.