అక్కా.. నేను చనిపోతున్నా
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:52 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుల్లో ఒకరు చనిపోగా, మరోచోట కాల్వలో దూకిన యువకుడు గల్లంతయ్యారు.
సాగర్ ఎడమకాల్వలో దూకిన యువకుడు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుల్లో ఒకరు చనిపోగా, మరోచోట కాల్వలో దూకిన యువకుడు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన యువకుడు తన అక్కకు ఫోనలో మెసేజ్ పెట్టి సాగర్ కాల్వలో దూకాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో కడుపునొప్పి భరించలేక తండ్రి ఫోన చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా విడాకులు కావడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి చిట్యాల మండలంలో ఉరేసుకున్నాడు.
వేములపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అక్కా నేను చనిపోతున్నానంటూ తమ్ముడు ఆమె సెల్‌కు మెసేజ్ పెట్టి సాగర్ ఎడమ కాల్వలో దూకాడు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఏఎ్‌సఐ నరసింహారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దామరచర్ల మండలం బొల్లిగుట్టతండాకు చెందిన లావూరి శివ(24) యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవులో ఇంటికి వచ్చిన శివ సివిల్స్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. తాను సాగర్ ఎడమకాల్వలో దూకి చనిపోతున్నానని ఓ ఆటోడ్రైవర్ నెంబరు నుంచి సోదరి శారదకు మెసేజ్ పెట్టాడు. ఆమె ఆ నెంబర్‌కు ఫోన చేయగా, ఓ యువకుడిని వేములపల్లి బస్టాండ్‌లో దింపి నల్లగొండకు వెళ్తున్నట్లు ఆటోడ్రైవర్ చాపల మనోజ్ తెలిపాడు. తన తమ్ముడు చనిపోతున్నానంటూ మెసేజ్ పెట్టాడని, కాపాడమని కోరటంతో మనోజ్ సాగర్ ఎడమకాల్వ వద్దకు బయలుదేరాడు. కాల్వలో దూకిన శివ కొట్టుకుపోతుండటంతో మనోజ్ తన ఫోనలో చిత్రీకరించి వారి కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న శివ కుటుంబసభ్యులు కాల్వ వెంట చూడగా అప్పటికే గల్లంతైపోయాడు. శివ తండ్రి బాషా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదుచేశారు.
కడుపునొప్పి భరించలేక...
రామన్నపేట, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్‌ఐ మల్లయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సర్నేనిగూడెం గ్రామానికి చెందిన బర్మ లింగస్వామి(24) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం నొప్పి తీవ్రం కావడంతో వ్యవసాయ బావి వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. అనంతరం తండ్రి సత్యనారాయణకు ఫోన చేసి తాను క్రిమిసంహారక మందు తాగి చనిపోతున్నానని చెప్పాడు. హుటాహుటిన తల్లిదండ్రులు బావి వద్దకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న లింగస్వామిని స్థానిక వైద్యుడి వద్దకు అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. లింగస్వామి తమ్ముడు బర్మ మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లయ్య తెలిపారు.
ప్రేమ పెళ్లి విఫలమైందని...
చిట్యాల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి పెద్దలు బలవంతంగా విడాకులు ఇప్పించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాల ఎస్‌ఐ ధర్మా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిట్యాల మునిసిపాలిటీ పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన చిరబోయిన మల్లయ్య కుమారుడు మహేష్(25) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని కొద్దిరోజులు హైదరాబాద్‌లో నివాసమున్నారు. వారిమధ్య మనస్పర్థలు రావడంతో ఈ నెల 11వ తేదీన మాట్లాడుకుని పెద్ద మనుషుల సమక్షంలో విడాకుల ఒప్పందం చేసుకున్నారు. అప్పటినుంచి మనస్తాపంతో ఉన్న మహేష్ గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధర్మా తెలిపారు.