Land Rights Act: ఇళ్ల స్థలాలకూ పాస్ పుస్తకాలు
ABN , Publish Date - Aug 18 , 2024 | 04:27 AM
కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వస్తే.. గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలను ఇస్తుంది. అంటే.. వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.
10,894 గ్రామాల్లో స్థల యజమానులకు ప్రయోజనం
సాదాబైనామా పరిశీలన.. హక్కుపత్రాల జారీ
ధరణిలో నమోదు కాని అర్హులకు కూడా..
అధికారం ఆర్డీవోకు దఖలు
పాత పాస్ పుస్తకాల కొనసాగింపు
ధరణిలో జరిగినతప్పుల సవరణకు అవకాశం
కొత్త ఆర్వోఆర్ అమల్లోకి వస్తే.. తగ్గనున్న వివాదాలు
దేశంలోనే భూధార్ తొలిరాష్ట్రంగా తెలంగాణ!
హైదరాబాద్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వస్తే.. గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలను ఇస్తుంది. అంటే.. వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాదు.. కొత్త ఆర్వోఆర్ చట్టంలో పాత సమస్యలకు పరిష్కారాలను చూపించనున్నారు. ఉదాహరణకు.. 18 లక్షల ఎకరాల భూములు ఇప్పటి వరకు ధరణిలో నమోదు కాలేదు.
కొత్త చట్టం ద్వారా ఈ భూముల యజమానులకు కూడా హక్కు పత్రాలను అందజేస్తారు. భూదాన్, ఇతర వివాదాస్పద భూములను మినహాయిస్తే.. 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు దక్కవచ్చని అంచనా. కొత్త ఆర్వోఆర్‌తో సాదాబైనామా దరఖాస్తులకూ పరిష్కారం లభించనుంది. వాటిని పరిశీలించి, హక్కు పత్రాలను జారీ చేసే అధికారాలను ఆర్డీవోలకు కట్టబెడతారు. భూములకు విశిష్ట సంఖ్య- భూధార్ కేటాయింపు జరిగితే.. దేశంలోనే ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపుపొందుతుంది. అంతేకాదు.. గ్రామస్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సాధ్యమవుతుంది.
9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులు
రాష్ట్రంలో 9.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఆర్వోఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఆ భూములు అసైన్డ్, సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే.. వాటికి హక్కుపత్రాలను జారీ చేస్తారు. ఈ అధికారం ఆర్డీవోకు ఉంటుంది. 1989 నుంచి 2016 వరకు సాదాబైనామా దరఖాస్తులకు తహసీల్దార్లు హక్కుపత్రాలను జారీ చేసేవారు. కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్డీవోలకు దఖలుపడతాయి. ఆర్వోఆర్ ముసాయిదా చట్టంలోని సెక్షన్-6లో సాదాబైనామాలకు హక్కుపత్రాల జారీ వివరాలున్నాయి.
పెండింగ్ దరఖాస్తులను మినహాయిస్తే.. కొత్త దరఖాస్తులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. భూమి మీద 18 రకాలుగా హక్కులు కల్పించేలా కొత్త ఆర్వోఆర్ అవకాశం కల్పిస్తోంది. సెక్షన్2(12), 5, 7, 8 సెక్షన్ల ప్రకారం భూమిని మూడు కేటగిరీలుగా విభజించి, హక్కులు కల్పిస్తారు. సెక్షన్-5 ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లో అభ్యంతరాలుంటే.. మ్యుటేషన్‌ను నిలిపివేసే అవకాశాన్ని అధికారులకు కల్పించారు. అయితే.. మ్యుటేషన్‌ను నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖతపూర్వకంగా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. తహసీల్దార్ స్థాయిలో మ్యుటేషన్ నిలిచిపోతే.. అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. వీలునామాలు, వారసత్వ ఆస్తి పంపకాల విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ చేశాకే.. మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కొత్త చట్టం చెబుతోంది. లేనిపక్షంలో మ్యుటేషన్‌కు అవకాశం ఉండదు.
మూడుదశల్లో ధరణి లోపాల సవరణ
దరణిలో లోపాల కారణంగా రోజుకు సగటున వెయ్యికిపైగా సవరణ దరఖాస్తులు వస్తున్న విషయం తెలిసిందే..! కొత్త ఆర్వోఆర్ ప్రకారం ప్రభుత్వం మూడు దశల్లో ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సవరించనుంది. భూ సమస్యలను కూడా మూడంచెల్లో పరిష్కరించనుంది. తొలి దశలో పాస్‌పుస్తకాల్లో ఉన్న తప్పులను సవరిస్తారు. రెండో దశలో తాత్కాలిక భూధార్ కార్డులను అందజేస్తారు. వీటిలో జియోఫెన్సింగ్ వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయి.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. సరిహద్దులతో సహా.. రైతుల భూముల వివరాలు తెలిసిపోతాయి. ఈ విధానం అమల్లోకి వస్తే.. భూధార్ అందజేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. మూడో దశలో క్షేత్రస్థాయిలో తప్పొప్పులపై సమగ్ర విచారణ జరుపుతారు. ఇలా.. ధరణిలో గుర్తించిన 45 రకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది. సగటున ప్రతి గ్రామానికి 200 మంది రైతులు ధరణి సమస్యలతో సతమతమవుతుండగా.. వారందరికీ సాంత్వన లభించనుంది.
ఆర్వోఆర్ ఎలా వచ్చిందంటే..?
ఆర్వోఆర్ అనే వ్యవస్థ పుట్టుక వెనుకాల చాలా చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో తొలిసారి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అంతకు ముందు దేశంలో ప్రజలకు భూమితో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. కాలక్రమంలో సమూహాలుగా భూములను అనుభవిస్తున్న రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు బ్రిటిష్ వారు ఆర్వోఆర్ విధానాన్ని పరిచయం చేశారని భూచట్టాల నిపుణుడు సునీల్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పన్ను వసూళ్లకు ఈ విధానాన్ని అమలు చేశారని, ఆ తర్వాత చట్టాలుగా ఆర్వోఆర్ రూపాంతరం చెందిందని వివరించారు.