Share News

Ponguleti: సంక్రాంతిలోపు భూ సమస్యలకు మోక్షం

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:17 AM

శీతాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఆర్వోఆర్‌ చట్టం-2024 అమల్లోకి వస్తుందని, దీని ద్వారా సంక్రాంతిలోపు భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

Ponguleti: సంక్రాంతిలోపు భూ సమస్యలకు మోక్షం

  • గతంలో కన్నా మెరుగ్గా ట్రైబ్యునల్‌ వ్యవస్థ

  • 2 రోజుల్లో వీఆర్వో వ్యవస్థపై నిర్ణయం

  • ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాల ఆధారంగానే 1900 కోట్ల విలువైన భూముల్ని కాపాడాం

  • అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మం

  • అవసరమైతే 0.5% స్టాంప్‌ డ్యూటీ తగ్గిస్తాం

  • మంత్రిగా ఏడాదిలో సంతృప్తి: పొంగులేటి

  • గతంలో కన్నా మెరుగ్గా ట్రైబ్యునల్‌ వ్యవస్థ తెస్తాం

  • రెండు రోజుల్లో గ్రామ రెవెన్యూ వ్యవస్థపై నిర్ణయం

  • ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాల ఆధారంగానే

  • రూ.1900 కోట్ల విలువైన భూములను కాపాడాం

  • మంత్రిగా ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చింది

‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి పొంగులేటి

21.jpg

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శీతాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఆర్వోఆర్‌ చట్టం-2024 అమల్లోకి వస్తుందని, దీని ద్వారా సంక్రాంతిలోపు భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లోనే గ్రామ రెవెన్యూ సిబ్బంది నియామకంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ధరణి కారణంగా లక్షలాది మంది చిక్కుల్లో పడ్డారని, ఆయా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులకు ఏడాదిలోనే పరిష్కారం చూపడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....


  • కొత్త ఆర్వోఆర్‌ చట్టం వల్ల ప్రజలకు జరిగే సౌలభ్యం ఏంటి?

18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్‌ చట్టాల నుంచి మంచి అంశాలు సేకరించి కొత్త ఆర్వోఆర్‌ చట్టం-2024లో పెట్టాం. ఆర్వోఆర్‌-2020కి ముందు ఏ సమస్య వచ్చినా ట్రైబ్యునల్‌కు వెళ్లి అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టుకు వెళ్లే వారు. 2020 నాటి చట్టం ద్వారా ట్రైబ్యునల్‌ రద్దు చేశారు. ఇప్పుడు మరింత మెరుగ్గా ట్రైబ్యునల్‌ వ్యవస్థను తెస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి పరిష్కారం చూపబోతున్నాం. ఇంటి స్థలంపై హక్కు కల్పిస్తూ టైటిల్‌ ఇస్తాం. చట్టబద్ధత కల్పిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాల్లో గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల రక్షణ, విపత్తు సమయాల్లో ప్రజలకు అండగా ఉండే వ్యవస్థ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను పునరుద్ధరించే అంశంపై రెండు, మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకోనున్నాం. కొత్త ఆర్వోఆర్‌-2024 దేశానికి ఒక రోల్‌ మోడల్‌గా ఉండబోతుంది. అది అమల్లోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.


  • బీఆర్‌ఎస్‌ హయాంలో భూ కబ్జాలు జరిగాయా? వాటిపై చర్యలు ఉంటాయా?

హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోనే 2 వేల ఎకరాలను బీఆర్‌ఎస్‌ నేతలు స్వాహా చేశారు. 58, 59 జీవోల ప్రకారం ఉన్న వెసులుబాటును అడ్డు పెట్టుకుని కాజాగూడ, శేర్‌లింగంపల్లి వంటి ప్రాంతాల్లో రూ.కోట్ల విలువజేసే భూములు కాజేశారు. వీటిపై ‘ఆంధ్రజ్యోతి‘ సైతం అనేక కథనాలు ప్రచురించింది. ఆ ఆధారాలతోనే ఇప్పుడు రూ.1900 కోట్ల విలువ జేసే ఆస్తులను కాపాడాం. ఈ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టబోతున్నాం.

  • భూముల విలువను సవరించనున్నారా?

గతంలో అశాస్త్రీయంగా భూముల విలువలు సవరించారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుగు మార్కెట్‌లో రూ.6000 ఉంటే బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.8000కు పెంచారు. ఇలాంటి వాటిని సరిదిద్ది శాస్త్రీయ పద్ధతిలో వాస్తవ విలువనే నిర్ధారించాలని భావిస్తున్నాం. మార్చి తరువాత దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. అవసరమైతే స్టాంపుడ్యూటీని 0.5ుతగ్గిస్తాం.

  • మీరు చేయాలనుకుని.. చేయలేకపోయిన పని ఏదైనా ఉందా..?

భూ రీ సర్వే చేయించాలని అనుకున్నా. ఎవరైతే అనుభవంలో ఉన్నారో.. వాళ్లకు పూర్తి హక్కులు కల్పించాలంటే భూ రీ సర్వే చేయాల్సిందే. ఇప్పటికీ చాలా మందికి పట్టా ఉంటే భూమి లేదు.. భూమి ఉంటే పట్టా లేదు. రీ సర్వే చేస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపగలం. ఇది చేయలేకపోతున్నాననే అసంతృప్తి ఉంది..

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సహకారం తీసుకుంటారా?

బీఆర్‌ఎస్‌ పాలనలో గృహనిర్మాణ శాఖకు నిధులు రాలేదు. మేము మాత్రం నిబంధనల ప్రకారమే నిధులు పొంది పేదలకు లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నాం. కేంద్రం నిధులకు సంబంధించి వారు బ్రాండింగ్‌ చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి బేషజాలు లేవు. జనవరిలో ఇళ్ల నిర్మాణ పనులు మొదలవుతాయని ఆశిస్తున్నాం.


  • నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములు వేలం వేసే ఆలోచన ఉందా..?

నిజం ఏదో ఒక రోజు చెప్పాలి. అది చెప్పకపోతే పెద్ద పుండు అయి ఇబ్బంది పెడుతుంది. గత ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చింది. రూ.7లక్షల కోట్లకు వడ్డీల కిందే ప్రస్తుతం ప్రతి నెలా రూ.6500 కోట్లు చెల్లిస్తున్నాం. ప్రజాప్రయోజనాల కోసం తప్పదనుకుంటే పారదర్శకంగా భూముల అమ్మకం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ, అనవరసర ఖర్చుల కోసం విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టం.

  • ఏడాది పాలనలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన నిర్ణయాలేంటి?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి కలెక్టర్ల లాగిన్‌లో భూ సమస్యలకు సంబంధించి 2,45,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తి ఉండి.. ఏ తప్పూ చేయకున్నా.. లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెవెన్యూ మంత్రిగా ఏడాదిలోనే పెండింగ్‌ దరఖాస్తులకు పరిష్కారం చూపా. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. దీంతో ప్రజల నుంచి మరో 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలోనూ 2.50 లక్షలు పరిష్కరించాం. అప్పుడు చాలా సంతృప్తి కలిగించింది. తమను రోడ్డు మీద పడేశారని వీఆర్‌ఏలు, వీఆర్‌వోలు చెబుతుండే వారు.. ఇప్పుడు వారికి భరోసా ఇచ్చి, మళ్లీ అవకాశం ఇవ్వబోతున్నందుకు ఆనందంగా ఉంది. గతంలో తొలగించిన వారిలో నుంచే సుమారు 11వేల మందిని తీసుకోబోతున్నాం. సంక్రాంతి లోపు దీన్ని పూర్తి చేస్తాం. ఇక మూడోది కొత్త ఆర్వోఆర్‌ చట్టం తీసుకురావడం చాలా తృప్తిని ఇచ్చింది.

Updated Date - Dec 08 , 2024 | 04:17 AM