Liquor Sales: మందు బాబులకు బిగ్ షాక్.. ఉన్నపళంగా వెలసిన బోర్డులు..
ABN , Publish Date - Apr 27 , 2024 | 09:55 PM
అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్‌కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్‌లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27: అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్‌కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్‌లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు. దీంతో హతవిధి ఎంత పరిస్థితి వచ్చేరా అంటూ నిట్టూరుస్తున్నారు బీరు బాబులు.
అవును.. తెలంగాణ వ్యాప్తంగా బీర్లు కొరత నెలకొంది. గ్రామ దేవతల పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పైగా ఎన్నికల సమయం కావడంతో.. బీర్లకు ఫుల్ గిరాకీ వస్తోంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చల్లగా బీరు తాగుదామని వైన్ షాపులకు వెళ్తున్న వారికి.. నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో బీర్ల కొరత అధికంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గ్రామ దేవతల పండుగలు, పెళ్లిళ్లు, ఎన్నికల సమయం కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో.. జిల్లా పరిధిలో బీర్ల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. జిల్లాలో రోజూ వారీగా పెద్ద ఎత్తున బీర్లు అమ్ముడు పోతున్నాయని వైన్ షాప్‌ల యజమానులు చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని మందుబాబులు వాపోతున్నారు. దీంతో వైన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు మద్యం ప్రియులు.