Share News

Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:21 AM

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పాపికొండల పర్యాటక సందడి మొదలైంది. వరదల సీజన్‌ ముగియడంతో ఏపీలోని కాకినాడ పోర్టు అధికారులు పర్యాటక సీజన్‌కు పచ్చజెండా ఊపారు.

Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

టికెట్‌ ధర పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750.. ఆరు నెలల పాటు సాగనున్న పర్యాటక యాత్ర

  • తెలంగాణ పర్యాటక వెబ్‌సైట్‌లో బోటింగ్‌ టికెట్లు

  • గుర్తింపు కార్డులు తప్పనిసరి

  • లాంచీల్లో మద్య నిషేధం అమలు

  • శాకాహార భోజనానికే అనుమతి

భద్రాచలం, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పాపికొండల పర్యాటక సందడి మొదలైంది. వరదల సీజన్‌ ముగియడంతో ఏపీలోని కాకినాడ పోర్టు అధికారులు పర్యాటక సీజన్‌కు పచ్చజెండా ఊపారు. పాపికొండల లాంచీల నిర్వాహకులు దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా పాపికొండల విహారయాత్రను పునఃప్రారంభించారు. దీంతో గత రెండు రోజులుగా ఏపీలోని ఏఎ్‌సఆర్‌ జిల్లా వరరామచంద్రాపురం మండలం పోచవరం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.


  • ఆరు నెలల పాటు సాగనున్న విహారయాత్ర

జూలై నుంచి ఇటీవల వరకు గోదావరి వరదల కారణంగా పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదల కాలం పూర్తికావడంతో పాపికొండల పర్యాటక యాత్రను పునరుద్ధరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పాపికొండ యాత్రకు వెళ్లేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ పర్యాటక వెబ్‌సైట్‌లో బోటింగ్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టికెట్‌ ధర నిర్ణయించగా భద్రాచలం నుంచి ఏపీలోని వరరామచంద్రపురం మండలం పోచారం వరకు వాహనంలో ఒక్కొక్కరిని తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు రూ.300 చెల్లించాల్సి ఉంటుందని స్థానిక నిర్వాహకులు తెలిపారు. భద్రాచలం కేంద్రంగా పలువురు ఏజెంట్ల వద్ద టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఆసక్తి గలవారు పాపికొండల విహారయాత్ర టికెట్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు. పాపికొండల విహారయాత్ర ఏప్రిల్‌ వరకు కొనసాగనుంది.


  • రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి

గతంలో పాపికొండల విహారయాత్రలో గోదావరిలో జరిగిన పలు ప్రమాదాల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి రక్షణ చర్యలతో పాపికొండల విహారయాత్ర నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. లాంచీలో వెళ్లే పర్యాటకులు ముందుగా తమ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. అలాగే పర్యాటకులు లైఫ్‌ జాకెట్లను తప్పక ధరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలతో లాంచీలో పూర్తిగా మద్యాన్ని నిషేధించారు. కేవలం శాకాహార భోజనం మాత్రమే అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలా ఉండగా బోటు ప్రారంభమయ్యే సమయంలో రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖ, పోర్టు అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తేనే లాంచీ విహారయాత్రకు బయలుదేరుతుంది.


  • తెలంగాణ వైపు నుంచి వెళ్లాలంటే ఇలా..

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం మీదుగా భద్రాచలానికి వెళ్లాలి. అక్కడ నుంచి నెల్లిపాక, కూనవరం మీదుగా వరరామచంద్రాపురం మండలం పోచవరం వరకు 80కి.మీ వాహనంలో ప్రయాణించి అక్కడ గోదావరి ఒడ్డున లాంచీల్లోకి ఎక్కి విహారయాత్రకు వెళ్లి మళ్లీ అక్కడికే రావాల్సి ఉంటుంది.

Updated Date - Oct 15 , 2024 | 04:21 AM