ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు సమన్లు
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:20 AM
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టవ్వగా.. తాజాగా ఖద్దరు ప్రమేయంపై విచారణ మొదలైంది.
ఖద్దరు ప్రమేయంపై విచారణ షురూ
విచారణకు లింగయ్య గైర్హాజరు
మరికొందరికి సమన్లు జారీ చేసే అవకాశం
రేపటితో ముగియనున్న భుజంగరావు బెయిల్ గడువు
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టవ్వగా.. తాజాగా ఖద్దరు ప్రమేయంపై విచారణ మొదలైంది. దర్యాప్తులో అత్యంతక కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎ్‌ఫఎ్‌సఎల్)నివేదికలో రాజకీయ నాయకుల ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తు అధికారులు ఈ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల ఫోన్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపించారు. ఇటీవల ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక అందడంతో.. ఈ కేసుతో సంబంధం ఉన్న పొలిటికల్ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్న గత ప్రభుత్వ నాయకులకు నోటీసులు జారీ చేసి, విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో.. గత శనివారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ సమన్లలో ఆదేశాలు జారీచేశారు.
ఆ మేరకు లింగయ్య సో మవారం ఉదయం జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరవ్వాల్సి ఉండగా.. మధ్యాహ్నానికి వస్తానంటూ తొలుత సమాచారం పంపినట్లు తెలిసింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో విచారణకు రాలేకపోతున్నట్లు చెబుతూ.. గురువారం విచారణకు వస్తానని సమాచారం పంపారు. అయి తే.. విచారణకు లింగయ్య సహకరిస్తే.. గత ప్రభుత్వంలో పనిచేసిన మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల పేర్లు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. వారికి కూడా సమన్లు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ/ప్రస్తుత ఎమ్మెల్యేల చిట్టాను ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక ఆధారంగా సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం లింగయ్యకు సమన్లు జారీ చేశామని, ఆయన విచారణ తర్వాత.. మిగతావారిని విచారిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన అదనపు ఎస్పీ భుజంగరావు బెయిల్ గడువు బుధవారంతో ముగియనుంది.