Housing Scheme: ఇందిరమ్మ ఇంటికి భరోసా!
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:24 AM
రాష్ట్రంలో పేదల కోసం చేపట్టనున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పీఎంఏవైకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది.
పీఎంఏవై పథకానికి అనుసంధానం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం
పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కారు?
పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు.. గ్రామాల్లో రూ.1.30 లక్షలకు?
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదల కోసం చేపట్టనున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పీఎంఏవైకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. పీఎంఏవై కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణాల పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తుంటుంది. ఆ నిధులు అందుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాలి.
ఆ వివరాలను పరిశీలించిన తర్వాత కేంద్రం విడతల వారీగా రాష్ట్రాలకు నిధులు అందజేస్తుంది. 2024-25లో పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని మోదీ సర్కారు తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయినప్పుడు రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని, ఆర్థిక సాయాన్ని కూడా పెంచాలని కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు.
సర్కారుకు ఉపశమనం..
రాష్ట్రంలో ఇళ్లు లేని అర్హులైన పేదలకు (ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, జాగా లేని వారికి స్థలమిచ్చి, ఆర్థిక సాయం) ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం 2024-25లో తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 ఇళ్లను పేదలకు అందించాలని, రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇళ్లను ప్రభుత్వ అధీనంలో ఉంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు 22,500కోట్ల నిధులు కావాలని గృహనిర్మాణ సంస్థ అంచనా వేసింది. ఇందిరమ్మ ఇంటిని పీఎంఏవైకి అనుసంధానిస్తే పేదలతో పాటు ప్రభుత్వానికి ఉపశమనం లభించనుంది.
సాయం పెంచాలని వినతి..
గృహ నిర్మాణ పథకంలో ప్రస్తుతం 2015 నిర్మాణ అంచనాల ప్రకారం కేంద్రం సాయం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్మాణ అంచనాలను పెంచాలని కోరింది. 2015 తర్వాత సిమెంటు, స్టీల్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందున.. ఆర్థిక సాయాన్ని పెంచి ఇస్తే పేదలకు న్యాయం జరుగుతుందని కేంద్రానికి వివరించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.1.60 లక్షలకు పైగా ఇస్తుండగా, దీన్ని రూ.2 లక్షల వరకు.. గ్రామీణంలో రూ.75 వేలకు పైగా ఇస్తున్న సాయాన్ని రూ.1.30 లక్షలకు పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం..
కేంద్రం అందించే పీఎంఏవై సాయాన్ని అందుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ జాబితాను కేంద్రానికి అందించలేదు. ఫలితంగా 2017-18 తర్వాత పీఎంఏవై నిధులు రాష్ట్రానికి రాలేదు. 2016-17లో రూ.190.79 కోట్లు, 2017-18లో రూ.1120.7 కోట్లు కేంద్రం నుంచి అందాయి. ఆ తర్వాత గత ప్రభుత్వం కేంద్రానికి జాబితా ఇవ్వలేదు. దాంతో కేంద్రం కూడా నిధులివ్వలేదు. అందుకే గత ప్రభుత్వం చేపట్టిన ‘డబుల్ బెడ్ రూం’ ఇళ్ల పథకానికి ఆర్థిక సమస్య ఏర్పడిందనే విమర్శలున్నాయి.