Loan Waiver: రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం..
ABN , Publish Date - Aug 22 , 2024 | 03:12 AM
వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
2 లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచే..
5 క్యాటగిరీల్లో వివరాల సేకరణ
వారం రోజుల్లో పూర్తి చేయాలని
లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు
ఫిర్యాదుల స్వీకరణను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఆధార్ తప్పుగా ఉన్న, కుటుంబ నిర్ధారణ కాని, పట్టాదారు పాస్‌పుస్తకం లేని, ఆధార్ పేరు-లోన్ అకౌంట్ పేరులో తేడా ఉన్నవారు, అసలు-వడ్డీ సరిపోలక తిరస్కరణకు గురైన రైతుల నుంచి.. మొత్తం ఐదు కేటగిరీలవారీగా అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుల కోసం వ్యవసాయశాఖ ఎలాంటి ప్రత్యేకమైన ఫ్రొఫార్మాను రూపొందించలేదు. కానీ అదే శాఖకు చెందిన ఓ అధికారి.. ఒక ప్రొఫార్మా తయారుచేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.
ఆ ఫ్రొఫార్మా ప్రకారమే ఏఈవో/ఏవోలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటరు కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, క్రాప్ లోన్ అకౌంట్‌కు సంబంధించిన జిరాక్సు కాపీలను కూడా రైతుల నుంచి తీసుకుంటున్నారు. కుటుంబ నిర్ధారణ కాని, సాంకేతిక సమస్యలు తలెత్తిన ఖాతాలకు సంబంధించిన సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
అయితే, రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణను వారంలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కేటగిరీలో ఉన్న రైతుల నుంచి మాత్రమే అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. రూ.2 లక్షలకు మించి పంట రుణాల బకాయిలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. రూ.2 లక్షలకు మించి అప్పున్న రైతులు.. పైమొత్తాన్ని చెల్లిస్తే, మిగిలిన రూ.2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రైతుల ఫిర్యాదులపై రోజువారీ నివేదికలు
రైతుల నుంచి ఫిర్యాదులను తీసుకున్న తర్వాత అధికారులు వాటిని కేటగిరీల వారీగా ‘సీఎల్‌డబ్ల్యూ’(క్రాప్ లోన్ వీవర్) పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ పోర్టల్‌ను ప్రస్తుతం అప్‌డేట్ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో పోర్టల్‌లో ఫిర్యాదుల అప్‌లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను గురువారం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో)కి పంపించాలని వ్యవసాయశాఖ డైరెక్టరేట్ నుంచి ఏఈవోలకు ఆదేశాలు వెళ్లాయి. రైతుల ఫిర్యాదులపై రోజు వారీ నివేదికలు మండలాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి డైరెక్టరేట్‌కు వెళ్లనున్నాయి.