Share News

ABN Effect: ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన కేటీఆర్. ఆ పాపకు అండగా నిలుస్తామని భరోసా

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:05 PM

క్యాన్సర్‌తో బాధపడుతున్న పసికూన ఆరుషీని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో షేర్ చేశారు.

ABN Effect: ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన కేటీఆర్. ఆ పాపకు అండగా నిలుస్తామని భరోసా

హైదరాబాద్: క్యాన్సర్‌తో బాధపడుతున్న పసికూన ఆరుషీని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో షేర్ చేశారు. తన టీం ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సాయం చేస్తుందని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

సాయం చేయాలనుకునేవారు..

పాలు తాగే వయసు కూడా దాటని ఆరుషీపై క్యాన్సర్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సర్జరీ చేసి కణతులు తొలగించినప్పటికీ మరల చికిత్స అవసరమవుతుండటంతో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న ఆ బిడ్డ తల్లిదండ్రులు దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. తమ కూతురు ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన అయితగోని రవి, మమత దంపతుల ఏకైక కుమార్తె ఆరుషీ. 20 నెలల వయసున్న ఆ శిశువుకి... వెన్నెముకలో కణతి ఉండటంతో ఏప్రిల్‌ 27న మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.


దురదృష్టవశాత్తు తిరిగి అదే చోట మరో కణతి ఏర్పడటంతో గత నెల 20న రెండోసారి సర్జరీ చేసి దాన్ని తొలగించారు. అయితే ఈ సర్జరీ తర్వాత మళ్లీ ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కీమో థెరపీ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. రెండు సర్జరీలకు ఇప్పటికే రూ. 8 లక్షలు ఖర్చయ్యాయని, మరో ఎనిమిది లక్షల దాకా అవసరమవుతుందని రవి చెప్తున్నాడు.

పాప కీమోథెరపీ ఒక్కసారి(ఒక సైకిల్‌)కి రూ. 1.50 లక్షల నుంచి 1.80 లక్షల వరకు వ్యయం కానుంది. ప్రైవేటు ఉద్యోగం చేసుకునే తాను ఖర్చు భరించలేకపోతున్నానని, దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నాడు. దాతలు.. అకౌంట్‌ నంబర్‌ 39905920603, ఐఎఫ్ఎస్‌సీ - ఎస్‌బీఐ 011984 నంబరుకు లేదా 6300355536(అయితగోని రవి) నంబరుకు గూగుల్‌పే చేయవచ్చన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ స్పందించడంపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఏబీఎన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దాతలు కూడా అండగా నిలిచి పాప ప్రాణాలు కాపాడాలని వారు ప్రాధేయపడుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 23 , 2024 | 06:08 PM