RTC Bus Drivers: ఎండలతో బేజారు.. హడలిపోతున్న ఆర్టీసీ బస్‌డ్రైవర్లు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:49 PM
మంట పుట్టిస్తున్న ఎండలతో గ్రేటర్‌లో సిటీ బస్సులు(City buses) నడపలేక ఆర్టీసీ డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న రికార్డుస్థాయి పగటి ఉష్ణోగ్రతలతో సిటీ బస్సుల్లో గంటలకొద్దీ డ్రైవింగ్ సీట్లో కూర్చోలేక డ్రైవర్లు చుక్కలు చూస్తున్నారు.
- అధిక ఉష్ణోగ్రతలతో బస్సుల్లో కూర్చోలేక అవస్థలు
- మధ్యాహ్నం వేళ వడగాలులతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ సిటీ: మంట పుట్టిస్తున్న ఎండలతో గ్రేటర్‌లో సిటీ బస్సులు(City buses) నడపలేక ఆర్టీసీ డ్రైవర్లు చెమటలు కక్కుతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న రికార్డుస్థాయి పగటి ఉష్ణోగ్రతలతో సిటీ బస్సుల్లో గంటలకొద్దీ డ్రైవింగ్ సీట్లో కూర్చోలేక డ్రైవర్లు చుక్కలు చూస్తున్నారు. ఓవైపు ఎండ.. మరోవైపు వడగాలులతో మధ్యాహ్న వేళలో బస్సులు నడపలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులుగా ఎండలో బస్సులు నడుపుతూ పదులసంఖ్యలో డ్రైవర్లు అనారోగ్యం బారిన పడటంతో మధ్యాహ్నం షిఫ్ట్‌కు వచ్చేందుకు డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్‌లో సిటీబస్సులు నడపడమే కష్టమని, అందునా పెరిగిన అధిక ఉష్ణోగ్రతలతో బస్సులు ముట్టుకున్నా కాలిపోతున్నాయంటూ సిబ్బంది చెబుతున్నారు. అటు ఎండలు, ఇటు ఇంజన్‌వేడికి సీట్లో మూడు, నాలుగు గంటల పాటు కూర్చోలేక అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. కొంతమంది డ్రైవర్లు డ్యూటీలు చేయలేక మధ్యాహ్నం షిఫ్ట్‌లకు గైర్హాజరవుతున్నారు. గ్రేటర్‌జోన్ 25 డిపోల్లో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్
ఉద్యోగులకు గ్రాండ్ హెల్త్ చాలెంజ్..
ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్ పేరుతో ఏప్రిల్ 18 నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తోంది. డ్రైవర్లు, కండక్లర్లకు ఎండాకాలం ముగిసే వరకు డిపోల్లో మజ్జిగ, మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉచితంగా అందిస్తునట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎండలతో మధ్యాహ్న వేళల్లో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని, రద్దీరూట్లలో కూడా 10-12 మంది మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ఎండకాలం ముగిసే వరకు డ్రైవర్లు, కండక్టర్లు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రతిరోజు సూచనలు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్