Share News

Panchayat Raj funding: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు తగ్గిన కేటాయింపులు

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:31 AM

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు కేటాయించింది. 2023-24లో ఈ శాఖకు కేటాయించిన రూ.31,426 కోట్లతో పోల్చితే ఈసారి రూ.1,610 కోట్లు తగ్గింది.

Panchayat Raj funding: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు తగ్గిన కేటాయింపులు

  • ఈసారి రూ.29,816 కోట్లు.. రూ.1,610 కోట్ల తగ్గుదల

  • పింఛన్లకు రూ.14,861 కోట్లు

హైదరాబాద్‌, జూలై25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు కేటాయించింది. 2023-24లో ఈ శాఖకు కేటాయించిన రూ.31,426 కోట్లతో పోల్చితే ఈసారి రూ.1,610 కోట్లు తగ్గింది. చేయూత పథకం కింద దివ్యాంగులు, వయోవృద్ధులు, ఇతర కేటగిరీల వారికి పింఛను ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.14,861 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం ఆసరా పేరిట అమలు చేసిన ఇదే పథకానికి రూ.12 వేల కోట్లు ప్రకటించగా దాంతో పోల్చితే రూ.2,861 కోట్లు పెరిగినప్పటికీ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పింఛను పెంపుపై సంబంధితవర్గాల్లో సందిగ్ధం నెలకొంది.


దివ్యాంగులకు రూ.4వేలున్న పింఛన్‌ను రూ.6వేలు, వయోవృద్ధులు, ఇతరులకు రూ.2వేలున్న పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామన్న కాంగ్రెస్‌ సర్కారు హామీ మేరకు ఎప్పట్లోగా పెంపు చేస్తారనే దానిపై స్పష్టతలేదు. ప్రస్తుతం చేయూత పింఛను పథకం లబ్ధిదారుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం ఏటా రూ.11,548 కోట్లు వెచ్చిస్తోంది. ఉన్నవారికే అదనంగా పింఛను పెంచితే ఏటా రూ.21,600 కోట్లు అవసరం ఉంటుందని అంచనా. కాగా ఈ బడ్జెట్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ‘ఇందిరా మహిళాశక్తి’ పథకం పేరిట ఎస్‌హెచ్‌జీ సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.50.41కోట్లు ప్రకటించింది. అదేవిధంగా ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 63.86లక్షల మంది మహిళలకు రూ.10లక్షల బీమా కల్పించనున్నట్లు పేర్కొంది.

Updated Date - Jul 26 , 2024 | 04:31 AM