Share News

Musi River: ఇక మూసీపై దృష్టి!

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:15 AM

రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

Musi River: ఇక మూసీపై దృష్టి!

  • త్వరలోనే షెడ్లు, గోదాముల కూల్చివేతలు..

  • ఎంఆర్‌డీసీఎల్‌కు సహకరించనున్న హైడ్రా

  • ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే నివాసాల తొలగింపు

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌లో 12 వేలపైగా కబ్జాలు

  • నదికి ఇరువైపులా పూర్తయిన సర్వే

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు. దీనిపై మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌ఎ్‌ఫడీసీఎల్‌) సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సంబంధిత కుటుంబాల జాబితాను కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు.


ఇళ్లు ఇచ్చాకనే నిర్మాణాల తొలగింపు ప్రారంభించనున్నారు. ఇందుకు హైడ్రా సహకారం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక మూసీ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని షెడ్లు, గోదాంల కూల్చివేతనూ చేపట్టనున్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభమవాలంటే ముందుగా అక్రమణలన్నీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 3 నెలలుగా హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, ఎంఆర్‌డీసీఎల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి తూర్పున కొర్రెముల వద్ద ఉన్న ఔటర్‌ వరకు సర్వేను పూర్తి చేశారు. నార్సింగ్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో 12 వేలకు పైగా అక్రమణలు ఉన్నట్లు గుర్తించారు.


వీటిలో హైదరాబాద్‌ జిల్లాలోని ఆసి్‌ఫనగర్‌, అంబర్‌పేట, బహదూర్‌పురా, చార్మినార్‌, గోల్కొండ, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, సైదాబాద్‌ల పరిధిలో పెద్దఎత్తున అక్రమణలు ఉన్నట్లుగా తేల్చారు. బహదూర్‌పురా, సైదాబాద్‌, అంబర్‌పేట మండలాల పరిధిలో అధికంగా నిర్మాణాలు ఉన్నాయి. చాలావరకు మూసీ నదిలోనే కాలనీలు సైతం ఏర్పడ్డాయి. 30, 40, 60 గజాల్లోనే ఇళ్లు కట్టుకున్నారు. మధ్యలో 10 అడుగుల దారి కూడా లేకుండా నిర్మించుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ మండల పరిధి రామంతాపూర్‌, భగాయత్‌ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే వచ్చేశాయి.


ఆక్రమణలన్నీ తొలగించే బాధ్యతను హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలిసింది. అయితే, మూసీ వెంట వివిధ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సంతృప్తి పరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొందరు గోదాములు, షెడ్‌లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Updated Date - Sep 17 , 2024 | 03:15 AM