Share News

Bhatti Vikramarka: విద్యలో ప్రపంచంతో పోటీపడదాం

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:39 AM

ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, సౌకర్యాలు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.

Bhatti Vikramarka: విద్యలో ప్రపంచంతో పోటీపడదాం

  • రాష్ట్రంలో యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు

  • 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు

  • దసరా ముందు రోజు భూమి పూజ

  • వచ్చే దసరాకు స్కూళ్ల నిర్మాణం పూర్తి: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, సౌకర్యాలు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రకాల రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నట్లు, వీటిని ఇకపై ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్‌సలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం రూ.5000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం సచివాలయంలో యంగ్‌ ఇండియా స్కూళ్లకు సంబంధించిన వివరాలను వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా మీడియాకు వివరించారు. కార్యక్రమాన్ని ఇదే వేదిక నుంచి ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతికుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం విడివిడిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఇకపై ఒకే క్యాంప్‌సలో ఉంటాయని చెప్పారు. దీనివల్ల సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట ఉండి విద్యాభ్యాసం చేస్తారన్నారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లను పైలట్‌ ప్రాజెక్టుగా ముందు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదలుపెడుతున్నామని, ఈ దసరా ముందురోజు భూమి పూజ చేసి.. వచ్చే దసరా నాటికి వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ స్కూళ్లు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


ప్రస్తుతం కొడంగల్‌, మధిర, హుస్నాబాద్‌, నల్లగొండ, హుజూర్‌నగర్‌, మంఽథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్‌, కొల్లాపూర్‌, అందోల్‌, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, అచ్చంపేట, తిరుమలగిరి, తుంగతుర్తి నియోజక వర్గాల్లో తొలిదశ పనులు మొదలవుతాయని భట్టి విక్రమార్క వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తాము చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 6.29 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణలోని పాఠశాలల స్థితిగతులు మార్చేందుకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 03:40 AM