AP Assembly Speaker : 60 రోజులు రాకపోతే అనర్హత వేటు!
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:13 AM
అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీ సమావేశాలకు...

బడ్జెట్ సమావేశాలకు జగన్ రావాలి
ఎమ్మెల్యేకిచ్చే సమయమే ఇస్తాం
గతంలోని కౌరవ సభలా అసెంబ్లీ నిర్వహించం
గౌరవ సభలా హుందాగా నిర్వహిస్తాం: స్పీకర్ అయ్యన్న
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై, తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం... ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం సభలో మాట్లాడేందుకు ఆయనకు కూడా ఇస్తామని తెలిపారు. శాసనసభ సమావేశాలను కౌరవసభ మాదిరిగా కాకుండా గౌరవసభలా హుందాగా నడుపుతామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలకైనా ఆయన రావాలని సూచించారు. ప్రతిపక్ష హోదా లేని జగన్‌కు సీఎంకు ఇచ్చినంత సమయం ఎలా ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. సోమవారం ఏపీ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఈ నెల 22, 23 తేదీల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని స్పీకర్ తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించామని తెలిపారు. 23న రాజ్యసభ మాజీ చైర్మన్ వెంకయ్యనాయుడు రానున్నట్లు తెలిపారు. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావాలని హితవు పలికారు. సభలో వారికైనా మాట్లాడే స్వేచ్ఛనివ్వాలని జగన్‌కు సూచించారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా స్పీకర్‌కు లేఖలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగని, అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టడం కుదరదని స్పీకర్ అయన్నపాత్రుడు స్పష్టం చేశారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?