AP Government : రాజధానికి ఐటీ సొగసు
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:52 AM
ఒకపక్క రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు వేగంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మరోపక్క ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.

అమరావతిలో తొలి ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ సిద్ధం
ఎలక్ట్రానిక్ పదెకరాలు కేటాయించిన ప్రభుత్వం
మంగళగిరి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఒకపక్క రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు వేగంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మరోపక్క ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా పలు సంస్థలకు ఏపీ సీఆర్‌డీఏ భూములను కేటాయించింది. ఈ కేటాయింపుల్లో భాగంగా మంగళగిరి సమీపంలోని నిడమర్రులో ఐటీ టవర్‌ను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థకు గురువారం 10 ఎకరాలు కేటాయించారు. అమరావతి నవ నగరాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిడమర్రు వద్ద 6,577 ఎకరాల్లో ఎలకా్ట్రనిక్ సిటీని నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదలనకు అనుగుణంగా ఇపుడు ఎలకా్ట్రనిక్ సిటీ పరిధిలోనే ఐటీ టవర్ కోసం ఎల్‌అండ్‌టీ సంస్థకు భూమి కేటాయించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తొలినాళ్లలో సైబర్ టవర్స్‌ను నిర్మించిన తరహాలో అమరావతిలో కూడా ఐటీ రంగం అభివృద్ధికి దోహదపడే విధంగా దీనిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ టవర్‌ను డీప్ టెక్ ఐకానిక్ భవనంగా తీర్చిదిద్దుతారు.
రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఈ టవర్ నిర్మాణాన్ని చేపడతారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో విశాఖ తరువాత మంగళగిరి ప్రాంతంలో మాత్రమే కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. అయితే హైదరాబాద్, బెంగళూరు మాదిరి అమరావతిని కూడా ఐటీ ఉద్యోగులకు ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాజధాని ప్రాంతంలో తొలి ఐటీ టవర్‌గా దీనిని నిర్మించనున్నారు. నిడమర్రులో ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యాక దానిని ఐటీ సంస్థలకు అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు. దీనివల్ల వేలాది నిరుద్యోగ యువతకు రాజధానిలో ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో సైబర్ టవర్స్‌ని నిర్మించడంతో పాటు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మేధా టవర్స్‌ను అభివృద్ధి చేసిన అనుభవం ఎల్ అండ్ టీకి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే సీఎం చంద్రబాబు అమరావతిలో ఎల్ అండ్ టీ సంస్థకే ఐటీ టవర్ నిర్మాణ పనులు అప్పగించారని తెలుస్తోంది.