Political Leaders Betting Scandal: బెట్టింగ్ రాష్ట్రంలో జోరుగా పందేల నిర్వహణ
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:10 AM
గత ప్రభుత్వంలో ముఖ్యనేత సన్నిహితుడు మరియు మూడు రాష్ట్ర స్థాయి నాయకులు బెట్టింగ్ దందాలో కలసి పని చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఈ ముఠా బెట్టింగ్ నిర్వహణ కొనసాగిస్తోంది.

అసలు సూత్రధారి గత ప్రభుత్వంలో
ముఖ్యనేత సన్నిహితుడు
కొమ్ముకాస్తున్న ముగ్గురు నాయకులు
చాంపియన్స్ ట్రోఫీలో కోట్లు కుమ్ముడు
గోదావరి, విశాఖ జిల్లాల్లో గ్యాంబ్లింగ్
వారిలో ఇద్దరు రాష్ట్రస్థాయి నేతలు
కేసులు, అరెస్టులు లేకుండా ఒత్తిళ్లు
ఐపీఎల్‌లో మరింత జోరుగా బెట్టింగ్‌లు
గత ప్రభుత్వంలో ముఖ్యనేత సన్నిహితుడు ఒకరు.. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు నాయకులు, గోదావరి జిల్లాలకు చెందిన మరో నేత.. ఈ నలుగురిదీ ప్రత్యేక ‘బంధం’! పూర్వాశ్రమంలో ఉన్న పరిచయాలతో పాటు ‘బెట్టింగ్’ బంధం వీరిని మళ్లీ కలిపింది. ఆ ముఖ్యనేత సన్నిహితుడు నిర్వహిస్తున్న బెట్టింగ్‌కు ఈ ముగ్గురు నేతలు కొమ్ముకాస్తున్నారు.
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఆ ముఖ్యనేత సన్నిహితుడు కర్ణాటకకు చెందిన ముఠాలను రంగంలోకి దింపారు. తన అనుచరులను ముందు పెట్టి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో కోట్లలో బెట్టింగ్ నిర్వహించారు. పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడంతో ‘డొంక’ కదిలింది. అసలు విషయం ఏంటంటే... కేసులు, కీలక పాత్రధారుల అరెస్టులు లేకుండా ఆ ముగ్గురు నాయకులూ పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో బెట్టింగ్ దందాకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ నిర్వహించేందుకు ఆ ముఠా రెడీ అయ్యింది.
(అమరావతి-ఆంధ్ర జ్యోతి)
బెట్టింగ్ దందా కోసం పార్టీలకతీతంగా నలుగురు ఏకమయ్యారు. గత ప్రభుత్వంలో ముఖ్యనేత సన్నిహితుడికి, రెండు పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతలు తోడయ్యారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో విశృంఖలంగా సాగిపోతున్న బెట్టింగ్ దందా.. ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరిస్తోంది. పోలీసులు బెట్టింగ్ భూతం ఆనవాళ్లను ఒకవైపు నరుక్కుంటూ వస్తుంటే.. ముగ్గురు నేతలు దీన్ని ప్రోత్సహిస్తూ ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల జోలికి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. దొరికినా కేసులు పెట్టవద్దని, పెద్దవాళ్ల జోలికి అసలే రావొద్దంటూ పోలీసుల ముందరి కాళ్లకు బ్రేకులు వేస్తున్నారు. ముఖ్యనేత సన్నిహితుడికి క్రికెట్ అన్నా, పందేలన్నా మహా ఇష్టం. ఆయన వెంటే ఉండే మరో వ్యక్తి ఈ వ్యవహారాలను చూసుకునేవారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు, ఇతర టోర్నమెంట్ల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, రాయలసీమ, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో దర్జాగా బెట్టింగ్‌లు నిర్వహించారు. రాజకీయ అండ ఉండటంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న సందర్భాలు లేవు. ఒకవేళ పోలీసులకు ఎక్కడైనా దొరికినా ఎఫ్‌ఐఆర్‌ల దాకా వెళ్లకుండానే తొక్కిపడేసేవారు. ప్రభుత్వం మారినా సదరు వ్యక్తి అడ్డూఅదుపూ లేకుండా బెట్టింగ్ జోరు పెంచారు. గతంలో మాదిరిగానే కర్ణాటకకు చెందిన ముఠాలను రంగంలోకి దించి కోట్లాది రూపాయల బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. రాయలసీమకు చెందిన ఒకరిని, గోదావరి జిల్లాలోని మరో వ్యక్తిని ముందు ఉంచి దందా న డిపిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఈ ముఠా రెచ్చిపోయింది. ఈ ఇద్దరూ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మకాం వేసి వేలాది మందితో బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై కీలక సమాచారం అందుకున్న పోలీసులు రాజానగరం, మండపేట ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పంటర్స్(జూద నిర్వాహకులు)ను పట్టుకున్నారు. వారిని విచారించగా కర్ణాటక ముఠాగా తేలింది. వీరి వెనక సదరు వ్యక్తి, ఆయన వెంటే ఉండే సహాయకుడి పాత్ర ఉన్నట్టు బయటపడింది. ఆయన ఇద్దరు అనుచరుల్లో పేరు మోసిన ఓ బెట్టింగ్ రాయుడు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. పోలీసులు విచారించగా ఇద్దరి మధ్య సంబంధాలు వెల్లడయ్యాయి. గతంలో ఈ బెట్టింగ్ రాయుడు హైదరాబాద్‌లోనూ భారీగా బెట్టింగ్‌లు నిర్వహించారు. పలు కేసుల్లో సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అయితే నాడు ముఖ్యనేత అండతో పోలీసులకు చిక్కలేదు. ప్రభుత్వం మారినా ఇప్పుడు అదే ధైర్యంతో బెంగళూరు, రాయలసీమతో పాటు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్ దందాలో రెండు పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతల పాత్ర ఉన్నట్లు తెలిసింది. అందులో ఓ నేత గోదావరి జిల్లాలకే చెందిన వారు. ఆయన తమ్ముడి పాత్ర కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
నిందితులకు నేతల అండ!
బెట్టింగ్ కేసుల్లో సదరు వ్యక్తి అనుచరులు అరెస్ట్ కాకుండా, కేసుల విచారణ ముందుకు సాగకుండా రెండు పార్టీల్లోని ముగ్గురు నేతలు రక్షణ కవచంలా నిలిచారని తెలుస్తోంది. రాజకీయాలు వేరైనా, పార్టీలు వేరైనా వారి మధ్య బెట్టింగ్ బంధం బలంగా ఉన్నట్లు ఉంది. పోలీసులు నమోదు చేసిన కేసులను నీరుగార్చేలా, నిందితులను విడిచిపెట్టేలా ఆ నేతలు తెరవెనక భారీ వ్యవహారమే నడిపారని తెలిసింది. పోలీసులు బెట్టింగ్ రాయుళ్ల విషయంలో సీరియ్‌సగా ఉండటంతో వారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి ముందడుగు వేయకుండా అడ్డుకున్నారని సమాచారం. నిజానికి మండపేట, రాజానగరం కేసుల్లో ఓ గోదావరి జిల్లా స్థాయి ప్రతినిధి, ఆయన సోదరుడి పాత్ర స్పష్టంగా బయటపడింది. ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా ఆ దిశగా పోలీసు విచారణ సాగకుండా తీవ్రస్థాయిలో నేతలు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కేసుల విచారణ సాగకుండా, అరె్‌స్టలు జరగకుండా చేశారు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పంటర్స్ వందల కోట్లు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు దాదాపు రెండు నెలల పాటు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల స్థాయిలోనూ భారీగా బెట్టింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. పోలీసుల చర్యలు తగ్గించేలా ఈ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
పార్టీలు వేరయినా...
బెట్టింగ్‌కు కొమ్ముకాస్తున్న ముగ్గురు నాయకులు గతంలో ఆ ముఖ్యనేత వద్ద రాజకీయ శిష్యరికం చేసిన వారే. ఆయన అనుచరులుగా ఎదిగిన వారే. మారిన రాజకీయ పరిస్థితుల నేపఽథ్యంలో పార్టీలు మారారు. రెండు పార్టీల తరఫున ఎన్నికల్లో గెలిచారు. కానీ పాత స్నేహాలు, చీకటిదందాలు మాత్రం మానలేదు. ముఖ్యనేత సన్నిహితుడితో అంటకాగుతున్నారు. ఇప్పుడు పార్టీలు వేరయినా బెట్టింగ్ బంధం వారిని ముందుకు నడిపిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో బెట్టింగ్ రాయుళ్లు, వాటిని ప్రోత్సహించే వారిపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా కేసులు పెడుతున్నారు. ఈ నేతలేమో జూదగాళ్ల అవతారమెత్తి చట్టంతో చెలగాటమాడుతున్నారు.
బెట్టింగ్ నిర్వహించే తీరిదీ..
బెట్టింగ్ ముఠాలు ముందుగానే ఆయా ప్రాంతాల్లో నేతలు ఇచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. వారి ఫోన్లకు లేదా ల్యాప్‌టా్‌పలకు ఆన్‌లైన్ లింకులు పంపిస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఏపీకే లింకులు పంపిస్తారు. వాటిని ఓపెన్ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఓ యాప్‌గా ఉంటుంది. అది ప్రైవేటు సర్వర్లతో లింక్ అయి ఉంటుంది. ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టా్‌పలు అయితే ఎనీ డెస్క్ అనే యాప్ లింకును పంపించి ఇన్‌స్టాల్ చేయిస్తారు. ఆ తర్వాత వీరు ఇచ్చే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో బెట్టింగ్ యాప్‌లో ఎంటర్ అయ్యేలా గైడ్ చేస్తారు. ఇలా ఆన్‌లైన్‌లో ఒక సీక్రెట్ ప్లాట్‌ఫామ్ కింద కనెక్ట్ అయిన వారిని కొందరు పర్యవేక్షిస్తుంటారు. బెట్టింగ్ యాప్‌లలో లాగిన్ అయ్యే వారి నుంచి తొలుత కొంత డబ్బును డిపాజిట్‌గా తీసుకుంటారు. ఆ తర్వాత ఫోర్, సిక్సర్, వికెట్ అవుట్, వైడ్, నోబాల్, క్లీన్‌బౌల్డ్, రనౌట్, క్యాచ్‌మిస్, వైడ్‌బాల్ తదితర వాటికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్ ఉంటుంది. ఇందులో పదివేలు బెట్టింగ్‌లో పెడితే అందులో 2,500 పంటర్స్‌కి ఇచ్చి తీరాలి. కాసిన పందెం నెగ్గితే 7,500 ఆ వ్యక్తికి వస్తాయి. ఓడిపోతే మొత్తం 10 వేలు పోతాయి. ఇలా 20, 30, 50 వేలు, లక్ష రూపాయల వరకు ఫీజులు ఉంటాయి. ఈ షరతులకు అంగీకరించిన వారికే లాగిన్ ఐడీలు ఇస్తారు.
For AndhraPradesh News And Telugu News