మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి : జేసీ
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:09 AM
జిల్లాలో మాదకద్రవ్యాల సమూల నియంత్రణపై అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించి చర్యలు చేపట్టాలని జేసీ విష్ణుచరణ్ అధికారులకు ఆదేశించారు.

నంద్యాల నూనెపల్లె, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదకద్రవ్యాల సమూల నియంత్రణపై అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించి చర్యలు చేపట్టాలని జేసీ విష్ణుచరణ్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మాదకద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఫ్యాక్టరీలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను ఫ్యాక్టరీల్లోకి అక్రమంగా తరలించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ షాపుల్లో వైద్యుడి ప్రిస్ర్కిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోలర్‌ను ఆదేశించారు. జిల్లాలో 8జాతీయ రహదారులు అనుసంధానం కావడం వల్ల సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని వీటిద్వారా సరఫరా అయ్యే రవాణాను అరికట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, డీఆర్వో రామునాయక్, జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్, నంద్యాల, ఆత్మకూరు ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.