Share News

కనుపూరు జాతరకు పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:31 AM

చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ జాతరకు జనం పోటెత్తారు. మూడో రోజైన గురువారం అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచీ భక్తులు తరలివచ్చారు.

కనుపూరు జాతరకు పోటెత్తిన భక్తజనం
జాతరలో భక్తజన సందోహం, బంగారు చీర అలంకారంలో ముత్యాలమ్మ

చిల్లకూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ జాతరకు జనం పోటెత్తారు. మూడో రోజైన గురువారం అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచీ భక్తులు తరలివచ్చారు. దీంతో తూర్పుకనుపూరు, కోట, సిద్ధవరం మార్గాలలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ముత్యాలమ్మ ఆలయం, పోలేరమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రాకతో తూర్పుకనుపూరు జనసంద్రంలా మారింది. ప్రధానంగా భక్తులు ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాల్లో, చెట్ల కింద సేద తీరారు. ఇక, వేయికండ్ల కుండలను భక్తులు నెత్తిన పెట్టుకుని గుడిపైకి కోడి పిల్లలు, చీరలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. ముత్యాలమ్మతో పాటు గంగమిట్ట మీద ఉంచిన పోలేరమ్మకు కూడా పొంగళ్లు పెట్టుకున్నారు. గురునాథస్వామి, అంకమ్మకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పరవశంతో నృత్యాలు చేశారు. అనంతరం గంగమిట్ట సమీపంలో రెండు తాటిచెట్ల మధ్య వేసిన ఉయ్యాలలో పోలిశెట్టి, గణాచారులు అమ్మణ్ణికి ఉయ్యాల సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆలయ ఈవో నవీన్‌కుమార్‌ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ గీతాకుమారి బందోబస్తు నిర్వహించారు.

నేటితో ముగయనున్న జాతర

గంగమిట్ట మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోలేరమ్మ అమ్మవారిని నాలుగో రోజైన శుక్రవారం ఉదయం ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించనున్నారు. దీంతో జాతర ముగుస్తుంది.

Updated Date - Mar 28 , 2025 | 01:31 AM