CM Chandrababu : రైతన్నపై ఫోకస్
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:17 AM
రైతుల అంశాలకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో కేంద్రప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం అయింది.

మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు.. నేడు హస్తినలో కీలక భేటీ
ధరల స్థిరీకరణ, ఎగుమతి సమస్యలపై
కీలక నిర్ణయం వెలువడే అవకాశం
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి వచ్చి అన్నదాతల సమస్యపై సీఎం ప్రత్యేక దృష్టి
వ్యవసాయ మంత్రి చౌహాన్‌తో వర్చువల్ భేటీ
సహకారానికి సిద్ధమైన మోదీ సర్కారు
జలజీవన్, పోలవరంపై పాటిల్‌తో చర్చలు
గత సీఎంలకు భిన్నంగా బాబు పర్యటనలు
ఏపీ కోసం తరచూ కేంద్ర మంత్రుల వద్దకు
‘గుట్టు’గా సొంత పనులపై నాడు జగన్
ధరల పతనంపై కేంద్రమంత్రితో మాట్లాడా
మిర్చి రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు
విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్లే మిర్చి ధర పతనమని వెల్లడి
న్యూఢిల్లీ, అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యపై గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రైతుల అంశాలకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో కేంద్రప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం అయింది. సాగు వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు దారులు మూసుకుపోవడంతో తలెత్తిన మిర్చి రేట్ల సమస్యను చౌహాన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. చంద్రబాబుతో చర్చల తర్వాత చౌహాన్ తన అధికారులతో సమీక్షించారు. ఈ సమస్యపై శుక్రవారం ఉన్నతాధికారుల స్థాయి సమావేశం నిర్వహించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి.. ఒక స్పష్టతకు వచ్చి.. చర్యలను ప్రారంభిస్తామని చంద్రబాబుకు చౌహాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో వినిపించడానికి, వాటికి పరిష్కారం సాధించడానికి చంద్రబాబు చురుగ్గా వేస్తున్న అడుగులు ఢిల్లీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో అప్పటి సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా రాష్ట్రం కోసం కాకుండా.. ఏవో సొంత పనుల మీద వచ్చి.. కలవాల్సిన వారిని గుట్టుగా కలిసేసి వెనుదిరిగేవారని ఢిల్లీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. చంద్రబాబు శైలి ఇందుకు పూర్తి భిన్నం.
ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా, రాష్ట్రానికి ఏం తీసుకెళ్లాలన్న తపనే ఆయనలో కనిపిస్తోందని ఈ వర్గాలు చెబుతున్నాయి. గురువారం వరుసగా ఇద్దరు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రి చౌహాన్‌ను వర్సువల్‌గా కలిసి రైతుల సమస్యలను చర్చించారు. ఉత్తరాంధ్ర మైనర్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో మాట్లాడారు. ‘అభివృద్ధిలో గుజరాత్ మాకు ఆదర్శం. మీ రాష్ట్రంతో మమ్మల్ని పోటీ పడనివ్వండి’ అంటూ పాటిల్ వద్ద సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి లాంటిదని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి వాజపేయీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఽమిర్చి ధరలు పడిపోవడంపై కేంద్రంతో చర్చించినట్లు చంద్రబాబు వివరించారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రేట్లు పడిపోయాయన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో మిర్చి రైతులకు మంచి ధర లభించిందని తెలిపారు. ధరల పతనంపై సమీక్షిస్తానని కేంద్ర మంత్రి చౌహాన్ హామీ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని వివరించారు. ’’మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. సాగు ఖర్చులను లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరాం. దీనిపై శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఏ విధంగానైనా రైతులను ఆదుకోవడమే కావాలి. శనివారం వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలు తెలుసుకుంటాను’’ అని సీఎం తెలిపారు.
జల్‌జీవన్ పనులకు రూ.27వేల కోట్లు
జల్‌జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు. ‘‘నదుల అనుసంధానంపై చర్చించాం. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం కోరాం. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు త్వరలో ఏపీకి వస్తారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ సురక్షిత నీటిని అందించే జల్‌జీవన్‌మిషన్‌ను వైసీపీ ప్రభుత్వం ఒక శాతం కూడా ఉపయోగించుకోలేకపోయింది. ఏపీకిరూ.27 వేల కోట్లను మంజూరు చేసినా పైపులైన్ల ద్వారా కాకుండా బోరు బావుల ద్వారా ఇస్తామనే పరిస్థితికి వచ్చింది. జల్‌జీవన్ నిబంధనలు కేంద్రం మార్చి 2028కి పనులు పూర్తిచేయాలని గడువు పెంచింది. దానిప్రకారం గతంలో కేటాయించిన రూ.27వేల కోట్లు మాత్రమే వస్తాయి. అన్ని ప్రాంతాల్లో కుళాయి ద్వారా నీరివ్వాలంటే అదనంగా రూ.54 వేల కోట్లు అవసరం. ఈ అంశంపై కేంద్రంతో మళ్లీ సంప్రదిస్తాం. ప్రస్తుతం రూ.27 వేల కోట్లకు డీపీఆర్ సిద్థం చేసి కేంద్రాన్ని నిధులు కోరతాం. ఒక ప్రభుత్వం అనుసరించే తప్పుడు విధానాలతో ప్రజలు ఏ విధంగా నష్టపోతారో తెలిపేందుకు జల్‌జీవన్ మిషన్ ఒక ఉదాహరణ. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను ఐదేళ్లూ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.’’ అని చంద్రబాబు వివరించారు.
నీటి పంపిణీ సున్నితమైన అంశం..
కృష్ణా నీటి తరలింపు అంశం సున్నితమైన సమస్య అని, దాటిపై రాజకీయం చేయడం తగదని సీఎం చంద్రబాబు సూచించారు. ’’నదులు ప్రవహించే వరుసలో చూస్తే ఏపీ చిట్టచివర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నేను తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్లందించాం. ఇప్పుడు సముద్రంలోకి వెళ్లే నీరు ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఏపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాటినే వాడుకుంటున్నాం. కృష్ణా జలాల సమస్య ఉంది. ఇప్పటివరకు పాత విధానం ప్రకారమే ముందుకు వెళుతున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో రాజీ పడబోం. నీటి నిల్వసామర్థ్యం 45.72 మీటర్లు ఉంటుంది’’ అని సీఎం తెలిపారు. వంశీ అరెస్టుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఇందులో రాజకీయాలకు చోటు లేదన్నారు.
నేడు ఉన్నత స్థాయి సమావేశం
ఏపీలో మిర్చి ధరల పతనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తితో కేంద్రం రంగంలోకి దిగింది. 2024-25 సీజన్‌లో ఉత్పత్తి అయిన మిర్చి ధరలపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్(ఎంఐపీ) కింద ఏపీలో మిర్చి ధరల స్థిరీకరణపైనా, ఏపీ నుంచి మిర్చి ఎగుమతులను ప్రోత్సహిండంపైనా కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్‌జనరల్, అపెడా చైర్మన్, వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.