Share News

Guntur : పుష్ప కాదు.. గోఖలేనే నిజమైన హీరో!

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:58 AM

సినిమా హీరోలు వినోదం మాత్రమే పంచుతారు. కానీ మన మధ్య నిజమైన హీరో ఉన్నారు. ఆయనే డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే

Guntur : పుష్ప కాదు.. గోఖలేనే నిజమైన హీరో!

  • 600 మంది రోగుల ప్రాణాలు కాపాడారు

  • ఇదే స్ఫూర్తితో వైద్యులు సేవలందించాలి

  • వైద్య విద్యార్థులకు మంత్రి సత్యకుమార్‌ పిలుపు

గుంటూరు మెడికల్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘సినిమా హీరోలు వినోదం మాత్రమే పంచుతారు. కానీ మన మధ్య నిజమైన హీరో ఉన్నారు. ఆయనే డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే. ఆయన ఏకంగా 600 మంది ప్రాణాలు కాపాడారు. విలువైన రూ. కోట్ల సంపాదన వదులుకొని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా 600 మంది రోగులకు గుండె ఆపరేషన్లు చేశారు. ప్రాణాలు నిలబెట్టిన గోఖలే నిజమైన హీరో’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కొనియాడారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి కార్డియాలజీ విభాగంలో 9 నెలల కాలంలో 115 గుండె ఆపరేషన్లు నిర్వహించడంతో ఆయా వైద్య నిపుణులను జీఎంసీ ఆడిటోరియంలో ఆదివారం సన్మానించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీజీహెచ్‌ కార్డియాక్‌, సీటీ సర్జన్లను పాల్గొన్నారు. 2015-19 మధ్య గుంటూరు జీజీహెచ్‌లో పద్మశ్రీ గ్రహీత, కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే, 600 మందికి గుండె ఆపరేషన్లు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనను ఘనం గా సన్మానించారు. మంత్రి సత్యకుమార్‌, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులు వైద్యులను సన్మానించారు. కాగా, ఈ కార్యక్రమానికి వైద్య విద్యార్థులు గైర్హాజరవడం పట్ల మంత్రి సత్యకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశా రు. చాలా మంది విద్యార్థులు వినోద కార్యక్రమాలకు, సినిమాలకు వెళ్లినట్లు వైద్యాధికారులు చెప్పడంతో మంత్రి పైవిధంగా స్పందించారు. గోఖలే స్ఫూర్తితో ఇతర వైద్యులు సమాజ సేవకు ముందు కు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.


ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కొక్క విద్యార్థిపై ఐదేళ్లల్లో రూ.1.71 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వీరు తిరిగి సమాజానికి సేవ చేయాలని మంత్రి కోరారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జి. నందకిశోర్‌ మాట్లాడుతూ.. ఐఎంఏ రాష్ట్ర శాఖ ‘పల్లెకు పోదాం’ కార్యక్రమంలో గ్రామాలను దత్తత తీసుకుని ఉచిత వైద్య శిబిరాలుతో పాటు గ్రామస్తులకు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో 100 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 24 , 2025 | 02:59 AM