ఆనంద..తీరం!
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:42 AM
దశాబ్దకాలంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

పదేళ్ల కిందట చంద్రబాబు ప్రకటన
నాడు చొరవ చూపని కేంద్రం
కనీసం పట్టించుకోని వైసీపీ
కూటమి రాకతో మళ్లీ వెలుగు
సీఎం చంద్రబాబు ఆదేశాలు
నేడు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్
అంతర్వేదిలో ఆర్డీవో పర్యటన
200 ఎకరాల భూముల గుర్తింపు
అంతర్వేది, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): దశాబ్దకాలంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాం లో సీఎం చంద్రబాబునాయుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను అంతర్వేది తీరంలో ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై అప్పటి ఎంపీగా ఉన్న డాక్టర్ పండుల రవీంద్రబాబు కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. అయితే అప్పట్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నష్టాల్లో ఉందన్న సాకుతో ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్, యూనివర్సిటీ ఏర్పాటు కాలేదు. అప్పట్లో కార్పొరేషన్ వస్తుందన్న ప్రచారంతో సముద్రతీర ప్రాంతంలో తక్కువ ధర ఉన్న భూములను సైతం అధిక ధరలకు కొనుగోలు చేసి రిసార్టులు, ఇతర భవనాలు నిర్మించారు. కానీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రతిపాదన గత పదేళ్లలో మరుగున పడిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఊసేలేదు. కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ సీఎం చంద్రబాబు అంతర్వేది తీరంలోనే అనువైన ప్రదేశంగా భావించి అక్కడే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనను ముం దుకు తెచ్చారు. దీనికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సైతం మొగ్గు చూపడంతో మళ్లీ ప్రాజెక్టు అమలుపై జిల్లా ప్రజల్లో ఆశలు చిగురించాయి. దీనిలో భాగంగా శుక్రవారం అమలాపురం ఆర్డీవో కె.మాధవి అంతర్వేది తీరాన్ని పరిశీలించి డ్రెడ్జింగ్ కార్పొరేషన్, యూనివర్సిటీ ఏర్పాటుకు సుమారు 200 ఎకరాల భూమి అవసరంగా భావించి పరిశీలనచేసి ప్రాథమికంగా మార్కింగ్ కూడా ఇచ్చారు. దాంతో ఇప్పుడు మళ్లీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటుపై అటు ప్రజాప్రతినిధులు, ఇటు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా రాజోలు నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, ఇతర సౌకర్యాలు లభిస్తాయనేది వారి ఆకాంక్ష. ప్రస్తుతం ఆర్డీవో మాధవి తీర ప్రాంత భూముల పరిశీలనతో ఆ ప్రాంతంలో మళ్లీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో హడావుడి నెలకొంది.
చిగురించిన ఆశలు.. భూములు పరిశీలించిన ఆర్డీవో..
సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో డ్రెడ్జింగ్ హార్బరు యూనివర్సిటీ కోసం స్థల పరిశీలన చేశామని అమలాపురం ఆర్డీవో కె.మాధవి తెలిపారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం ఆమె దర్శించుకుని అనంతరం అంతర్వేది నుంచి చింతలమోరి వరకు ఉన్న తీర ప్రాంత భూములను స్థానిక అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హ యాంలో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బరు ఏర్పాటుకు 200 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు.ఆ భూముల్లో ప్రస్తుతం రూ.1850 కోట్లతో డ్రెడ్జింగ్ హార్బరు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారన్నారు. ఇప్పటికే సముద్రతీరంలో పెరుగు భూములను పరిశీలించి మార్కింగ్ వేశామని, వాటిని సర్వేచేయించి ఎంత భూమి అవసరం అవుతుందో మ్యాపు ద్వారా పరిశీలించి నివేదిక తయారు చేస్తామన్నారు. తీర ప్రాంత భూముల్లో సరుగుడు, కొబ్బరి వేసి ఉన్న రైతులకు నష్టం కలుగుతుందని రైతులు అమలాపురం ఆర్డీవో కె.మాధవిని అడగ్గా ఆమె రైతులతో మాట్లాడారు. పెరుగు భూమిలోనే సాగు చేసుకుంటున్నారు కదా నష్టపోయేదేమి ఉంది.. ప్రభుత్వం స్వాధీన పరుచుకుని డ్రెడ్జింగ్ హార్బరు యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే అంతర్వేది పరిసరాలు అభివృద్ధి చెందుతాయ న్నారు. రోడ్లు, ఉపాధి కలుగుతుందని ఆమె రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ భాస్కర్, ఆర్‌ఐ రామరాజు, సర్వేయర్ భద్రరాజు, పలు సొసైటీల అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.