Share News

ISRO Chairman: పేదరికం నుంచి ఇస్రో పెద్దన్న దాకా

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:08 AM

పేద కుటుంబంలో పుట్టి.. పైకప్పు కూడా సరిగాలేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదివిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో సంస్థకు చైర్మన్‌ అవుతారని ఊహించగలమా..!

ISRO Chairman: పేదరికం నుంచి ఇస్రో పెద్దన్న దాకా

  • సాంకేతికత సహాయకుడిగా చేరి చైర్మన్‌ స్థాయికి

  • డాక్టర్‌ నారాయణన్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం

చెన్నై, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబంలో పుట్టి.. పైకప్పు కూడా సరిగాలేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదివిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో సంస్థకు చైర్మన్‌ అవుతారని ఊహించగలమా..! కానీ... తమిళనాడు చివరన ఉండే కన్యాకుమారి జిల్లా మేలాట్టువిలై గ్రామం నుంచి వచ్చిన వి నారాయణన్‌... ఇస్రో చైర్మన్‌గా నియమితులై ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక ఇస్రోలో సాంకేతిక సహాయకుడిగా చిరుద్యోగంలో చేరిన నారాయణన్‌... ఈ నెల 14న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నో కష్టాలకోర్చి ఇంతటి ఉన్నత స్థాయికి చేరిన ఆయన ప్రయాణం.. స్ఫూర్తిదాయకం.

కన్యాకుమారితో అనుబంధం..

తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి... తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ‘ఇస్రో’కు ఎనలేని అనుబంధం ఉంది. ఈ ప్రాంతం నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు శాస్త్రవేత్తలు ఇస్రోకు చైర్మన్లు కావడమే ఇందుకు తార్కాణం. ఈ జిల్లాకు చెందిన మాధవన్‌ నాయర్‌ (2003 సెప్టెంబరు 1 నుంచి 2009 అక్టోబరు 29 వరకు), కె శివన్‌ (2018 జనవరి 15 నుంచి 2022 జనవరి 14 వరకు) ఇస్రో చైర్మన్లుగా పనిచేశారు. ఇప్పుడు డాక్టర్‌ నారాయణన్‌ కూడా నూతన చైర్మన్‌గా నియమితులు కావడంతో తమిళనాట సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణన్‌ది పేద కుటుంబం.


పెన్నియ పెరుమాళ్‌, తంగమ్మాళ్‌ దంపతులకు ఆరుగురు సంతానంలో ఆయనే పెద్దవాడు. పాఠశాల విద్య కీలకాట్టువిలై ప్రభుత్వ పాఠశాలలో, మాధ్యమిక విద్య ఆదికాట్టువిలైలోని ఎయిడెడ్‌ పాఠశాలలో పూర్తిచేశారు. ప్లస్‌టూ వరకూ ఆయన చదువంతా తమిళ మాధ్యమంలోనే సాగింది. నాగర్‌కోయిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డొప్లొమో పూర్తిచేసిన ఆయన.. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో క్రయోజనిక్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చేశారు. అనంతరం ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. 41 ఏళ్ల క్రితం ఇస్రోలో సాంకేతిక సహాయకుడిగా చిరుద్యోగంలో చేరిన నారాయణన్‌ ఇస్రో చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ రాకెట్‌ సాంకేతికతను విజయవంతంగా నడిపించిన నారాయణన్‌ను ‘క్రయోజనిక్‌ కింగ్‌’గా అభివర్ణిస్తుంటారు.

అక్షరాలు దిద్దిన పాఠశాల అంటే ఇష్టం..

చిన్నప్పుడు తాను అక్షరాలు దిద్దిన పాఠశాల అంటే నారాయణన్‌కు ఎంతో ఇష్టం. ఆ పాఠశాలకు అవసరమైన వసతులు సమకూరుస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయుడు శివధాను తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని ఇలాంటి ఘటనలు నిరూపిస్తాయని ఆయన చెప్పారు.

Updated Date - Jan 10 , 2025 | 05:08 AM