Land Allotment : మహిళలకే పట్టా
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:42 AM
అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

గ్రామాల్లో 3.. పట్టణాల్లో 2 సెంట్ల స్థలం
పేదలందరికీ ఇళ్లు.. మార్గదర్శకాలు జారీ
పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు
ప్రజల సమక్షంలో లబ్ధిదారుల జాబితా
గ్రామం, పట్టణం యూనిట్‌గా ఎంపిక
ప్రైవేటు, అసైన్డ్ భూముల సేకరణ
పర్యవేక్షణకు మంత్రి అధ్యక్షతన కమిటీ
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయనుంది. అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఈ మేరకు ఉత్తర్వులు (జీఓ23) జారీ చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరిట ఇవ్వనున్నారు. పదేళ్ల తర్వాత యజమానికి పూర్తి హక్కులు (ఫ్రీ హోల్డ్) దక్కనున్నాయి. పట్టాలను ఈ మేరకు కన్వేయెన్స్ డీడ్ రూపంలో అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే టిడ్కో లేదా ఇతర స్కీమ్‌ల కింద హౌసింగ్ కల్పించనున్నారు. పథకం అమలు, పర్యవేక్షణ కోసం రెవెన్యూ మంత్రి చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పథకం అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇళ్ల స్థలాలు వీరికే...
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికే ఇళ్ల స్థలాలు.
మాగాణి, మెట్ట కలిపి ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు. ఆధార్, రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి.
ఈ పథకం కింద ఇంటి స్థలం కోరుకునే వారికి రాష్ట్రంలో మరెక్కడా సొంత ఇంటి స్థలం, ప్లాట్లు ఉండరాదు.
జగన్ హయాంలో స్థలం కేటాయించి, అందులో నిర్మా ణం చేయకుంటే రద్దుచేసి కొత్తగా కేటాయిస్తారు.
జగన్ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినా, పట్టా తీసుకోనివారికి అవకాశమున్న చోట కొత్త పట్టా.
గతంలో ఇంటి స్థలాలు కేటాయించి, దానిపై కోర్టుల్లో కేసులు ఉంటే, రద్దు చేసి కొత్తగా మరో చోట ఇస్తారు.
గతంలో పట్టా ఇచ్చినా గడువులోగా ఇంటి నిర్మాణం చేసుకోకుంటే వాటిని రద్దు చేసి కొత్తగా స్థలం కేటాయిస్తారు.
ప్రజల సమక్షంలో జాబితా
గ్రామం, పట్టణం యూనిట్‌గా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రామస్థాయిలో వచ్చే దరఖాస్తులను వీఆర్‌ఓ లేదా ఆర్‌ఐలు పరిశీలిస్తారు. గ్రామ, పట్టణ స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల సమక్షంలో ముసాయిదా లబ్ధిదారుల జాబితాను ప్రవేశపెడతారు. తర్వాత తుది జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు. ఇంటి స్థలానికి ఆధార్, రేషన్ కార్డును అనుసంధానిస్తారు. దీంతో గతంలో ఇళ్ల స్థలాలు తీసుకున్నవారు, మరెక్కడైనా సొంత ఇళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం తెలిసిపోతుంది.
స్థలాల కోసం భూసేకరణ
పేదలందరికీ ఇళ్లు పథకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. అందులో నిరుపయోగంగా ఉన్నవి లేదా ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల భూసేకరణ భారం తగ్గుతుంది. పేదింటి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేవారుంటే సంప్రదించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకోవాలని సూచించింది. చివరి ప్రయత్నంగానే అసైన్డ్ భూములపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గ్రామకంఠం పరిధిలో ఇళ్ల స్థలాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రెవెన్యూ శాఖ స్పష్టత ఇచ్చింది.
పర్యవేక్షణకు కమిటీలు
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. ఇందులో పురపాలక, గృహ నిర్మాణ శాఖల మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సీసీఎల్‌ఏ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సభ్య కన్వీనర్‌గా అదనపు సీసీఎల్‌ఏ ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ నేతృత్వాన అధికారుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, డిప్యూటీ కలెక్టర్ సమన్వయ అధికారిగా వ్యవహరించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News