Prakasam District : ‘ప్రకాశం’లో మహిళ మృతి
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:26 AM
కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బైళ్ల కమలమ్మ(50) ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం మృతి చెందారు.

కొమరోలు మండలం అలసందలపల్లి మహిళ మృతి
గ్రామంలో క్లోరినేషన్.. వైద్య శిబిరాల ఏర్పాటు
గుంటూరులోనూ ఒకరి పరిస్థితి విషమం
జీజీహెచ్‌లో ఇప్పటి వరకు ఎనిమిది కేసులు
గుంటూరు మెడికల్, కొమరోలు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) కలకలం రేగింది. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బైళ్ల కమలమ్మ(50) ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం మృతి చెందారు. ఆమె ఈనెల 2వ తేదీ రాత్రి ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు తొలుత గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సిఫార సు మేరకు ఈనెల 3వ తేదీన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా జీబీఎస్ బారినపడినట్లు తేలింది. దీంతో న్యూరాలజీ విభాగం ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇమ్యునో గ్లోబిలిన్ ఇంజెక్షన్లు కూడా ప్రారంభించారు. అయితే వ్యాధి తీవ్రత కారణంగా కోలుకోలేకపోయిన కమలమ్మ ఆదివారం తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆ సమాచారం అందడంతో వెంటనే జిల్లా, డివిజన్, మండల స్థాయి వైద్యారోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో సూపర్ క్లోరినేషన్ చేయించారు. గ్రామంలో రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జ్వరంతో బాధపడుతున్న వారికి రక్తపరీక్షలు చేస్తున్నారు. మరోవైపు సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. కాగా, కమలమ్మకు భర్త వెంకటయ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈ సీజన్‌లో రాష్ట్రంలో ఇది రెండో జీబీఎస్ మరణం. గత వారం శ్రీకాకుళం జిల్లాలో యుగంధర్ అనే బాలుడు జీబీఎ్‌సతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గుంటూరు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన ఆశీర్వాదం(50) ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్ట్రోక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం మరో వ్యక్తి జీబీఎస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లో చేరగా, వైద్య పరీక్షల్లో జీబీఎస్ నిర్ధారణ అయ్యింది. ఈ సీజన్‌లో గుంటూరు జీజీహెచ్‌లో ఇది ఎనిమిదో జీబీఎస్ కేసు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..