Share News

Jagan Housing Scheme : గాలిమేడలు !

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:12 AM

పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున.. రాష్ట్రమంతా మొత్తం 33 లక్షల మందికి సంతృప్తికరస్థాయి(శాచురేషన్‌)లో ఇచ్చామని జగన్‌ గొప్పలు చెప్పారు.

Jagan Housing Scheme :  గాలిమేడలు !

  • పట్టా ఇచ్చారు.. స్థలం ఇవ్వలేదు.. పేదలకు జగనన్న మోసం

  • 25 వేల మందికిపైగా గగ్గోలు

  • బెజవాడలోనే 2 వేల మంది

  • ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు

  • ఆ స్థలం మాత్రం భూమ్మీద లేదు

  • కొత్తగా మరో అవకాశం లేదు

  • దిక్కుతోచని పట్టాదారులు

  • ఆదుకోవాలని కూటమి సర్కారుకు మొర

గొప్పల కోసం జగన్‌ చేసిన నిర్వాకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. గత ప్రభుత్వాలు, పాలకుల కంటే తాను పేదలకు ఎక్కువ మేలు చేశానని డప్పు కొట్టుకోవడానికి ఎడాపెడా పట్టాలిచ్చేశారు. పట్టాలైతే ఇచ్చారు కానీ వేలాది మందికి గజం భూమి కూడా ఇవ్వలేదు. ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు. నిజానికి చూపించడానికి భూమే లేదు. ఇలా జగన్‌ సర్కారు దాదాపు 25 వేలమందికి పైగా పేదలను మోసం చేసినట్టు అంచనా. పేదలకు గాలిలో మేడలు కట్టించిందన్నమాట. ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇళ్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

కాగితాలే మిగిలాయి

ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు బొజ్జపు లోవలక్ష్మి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం చిట్టోడితోటకు చెందిన ఆమె అద్దె ఇంట్లో ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం సెంటు స్థలం మంజూరైందని చెప్పి ఇంటి స్థలం పట్టా ఇచ్చారు. కానీ స్థలం అప్పగించలేదు. గత ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి రమ్మని చెప్పి రిజిస్ట్రేషన్‌ చేసిన కాగితం చేతిలో పెట్టారు. ఆ కాగితాలే మిగిలాయి. ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో కూడా ఆమెకు తెలియదు.

Untitled-6 copy.jpg

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పీఐ) పథకం పేరిట జగన్‌ చేసిన భూ పంపిణీ ప్రహసనంగా మారింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున.. రాష్ట్రమంతా మొత్తం 33 లక్షల మందికి సంతృప్తికరస్థాయి(శాచురేషన్‌)లో ఇచ్చామని జగన్‌ గొప్పలు చెప్పారు.


కానీ ఆచరణలో లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయాయి. గత టీడీపీ ప్రభుత్వం కంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదలకు సొంతింటి స్థలాలు ఇవ్వాలని జగన్‌ ప్రయత్నించారు. ఆ ఆలోచన సరైందే అయినా ఆచరణలో విఫలమయ్యారు. నవరత్నాల కింద ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొందరికే దక్కాయి. లక్షలాది మందికి అసలు ఇవ్వలేదు. కొందరికి పట్టాలు, మరికొందరికి స్థలాలు ఇవ్వకున్నా ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకొన్నారు. దారుణం ఏంటంటే... దాదాపు 25 వేలమందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లుగా రికార్డులైతే రూపొందించారు కానీ స్థలాలు మాత్రం ఇవ్వలేదు. ఒక్క విజయవాడ నగర పరిధిలోనే దాదాపు 2000 మంది బాధితులు ఉంటారని అంచనా. విజయవాడ నగర బాధితులది మరో విషాదగాథ. లేని భూమిలో ఇంటి నిర్మాణం కోసం సగటున ఒక్కో లబ్ధిదారుడు 35 వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. డబ్బులు లేవన్నా.. డ్వాక్రా సభ్యులు కావటంతో వారికి రుణాలిప్పించి మరీ డబ్బులను వసూలు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

తిరిగి తిరిగి విసిగిపోయాం

గత ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చిందే కానీ స్థలం చూపించలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయాం. లబ్ధిదారుల జాబితాలో మా పేరు ఉంది. కానీ స్థలం మేం చూడనేలేదు. ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నాం. - జంగా సంధ్యారాణి,

జయంతిపేట, చీరాల


ఓట్లు దండుకునేందుకు...

ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతో జగన్‌ సర్కారు.. లేని భూమికి పట్టాలు ఇచ్చింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం పట్టా పొందిన వారి పేర్లు ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి జీవితంలో ఒకసారే ఇంటి స్థలం ఇస్తారు. రెండోసారి ఇవ్వరు. ఈ లెక్కన జగన్‌ సర్కారు దగ్గర పట్టాలు మాత్రమే పొందిన వారు కూడా ఇళ్ల స్థలాల లబ్ధిదారులే. వారికి భూమి పొజిషన్‌ చూపించకున్నా పట్టా ఉంది కాబట్టి లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లే లెక్క. ఇక వారు మరోసారి ప్రభుత్వ స్థలం పొందే అవకాశం లేదు. కూటమి సర్కారు పేదలకు స్థలాలు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని ప్రభుత్వం పాలసీ ప్రకటన చేసింది. మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జగన్‌ సర్కారు నుంచి లేని భూమికి పట్టాలు పొందిన వారి పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డరేవడిలా మారింది. పట్టాలు పొందారు కాబట్టి లబ్ధిదారుల జాబితాలో వారుంటారు. కాబట్టి కొత్తగా ఇచ్చే స్థలాల జాబితాకు వారు అనర్హులు. జగన్‌ ఇచ్చామన్న భూమి ఎక్కడుందో తెలియదు. కొత్తగా స్థలం తీసుకోలేరు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

విజయవాడ బాధితుల మొర

విజయవాడలోని 2 వేల మంది బాధితుల్లో తూర్పు నియోజకవర్గంలో 1270 మంది, విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలలో మిగిలినవారు ఉన్నారు. వణుకూరు, ఉప్పులూరు, కొండపావులూరు, కోలవెన్ను గ్రామాలలోని లే అవుట్లలో పట్టాలు ఇచ్చినా వారికి ప్లాట్లు చూపలేదు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్పొరేటర్లకు మొరపెట్టుకుంటున్నారు. పటమట 13 వ డివిజన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బాఽధిత మహిళలు స్థానిక కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. లేని భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వడం జగన్‌ సర్కారు చేసిన తప్పు. దీన్ని కూటమి సర్కారు సరిదిద్దాలని బాధితులు కోరుతున్నారు. పట్టాలు మంజూరయినా భూమిని పొజిషన్‌లో చూపనివారి పేర్లు గత ప్రభుత్వం రూపొందించిన లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, కూటమి ప్రభుత్వం కొత్తగా వారికి స్థలాలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి.


స్థలం చూపలేదు

ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు రేష్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమే్‌షనగర్‌ సమీపంలోని గుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగున్నరేళ్ల క్రితం జగనన్న కాలనీలో ఒక సెంటు స్థలం ఇచ్చారు. ఆమె పేరుతో రిజిస్ర్టేషన్‌ చేసినట్లుగా పట్టా ఇచ్చారు. కానీ స్థలం ఎక్కడుందో చూపించలేదు. స్థలాన్ని చూపించాలని వార్డు కౌన్సిలర్‌ను ఎన్నిసార్లు అడిగినా కాలయాపన చేశారు. ఆమెకు కేటాయించిన స్థలం ఉందా? ఎవరైనా కబ్జా చేశారా అనేది తెలియదు. రేష్మ భర్త మున్వర్‌ బాషా ఎలక్ట్రీషియన్‌. నెలకు రూ.3 వేలు చెల్లించి అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్థలం చూపిస్తే చిన్న గుడిసైనా వేసుకుని, అందులో నివాసం ఉంటామని, అద్దె భారమైనా తగ్గుతుందని రేష్మ అంటున్నారు. కూటమి ప్రభుత్వమైనా ఆ స్థలం ఎక్కడుందో చూపించాలని కోరుతున్నారు.

పట్టా ఇచ్చారంతే..

ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు మారెక్క. ఆమె స్వగ్రామం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్దేహాళ్‌. ఈమె దివ్యాంగురాలు. గ్రామ సమీపంలోని తిమ్మాపురం రోడ్డులో సర్వే నంబరు 216బీలో జగనన్న లే అవుట్‌ వేశారు. అందులో 101 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. మారెక్కకు కూడా అదే లే అవుట్‌లో స్థలం కేటాయించినట్లు చూపించి, నాలుగన్నరేళ్ల క్రితం పట్టా కాగితం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఆ స్థలాన్ని ఆమె పేరుతో రిజిస్ర్టేషన్‌ చేయించారు. స్థలం ఎక్కడుందో చూపించాలని వీఆర్వోను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఆర్డీటీ సంస్థ కట్టించి ఇచ్చిన ఒక చిన్న గదిలో మారెక్క, వారి బంధువు ఒకరు ఉంటున్నారు. స్థలం చూపితే చిన్న కొట్టమైనా వేసుకుంటామని మారెక్క అంటున్నారు.


పట్టా మాత్రమే ఇచ్చారు

జగనన్న కాలనీ కింద పట్టా అయితే ఇచ్చారు కానీ హద్దులు మాత్రం చూపలేదు. ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం నవరత్నాల కింద ఇంటి స్థలం లబ్ధి పొందినట్లు ఉంది. ఆ స్థలాన్ని మా పేరుతో ఇంకెవరయినా తీసుకున్నారేమో అనే అనుమానం ఉంది. గత ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లు చెప్పిందే కానీ దానిని చూపించకుండా మోసం చేసింది. ఈ ప్రభుత్వం అయినా మాకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నాం.

- బైలడుగు అంజలి, ముక్తేశ్వరం, బల్లికురవ మండలం, బాపట్ల జిల్లా

ఇదీ జగన్‌ లెక్క

  1. మొత్తం 33 లక్షల మంది పేదలకు

  2. ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లుగా జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పింది.

ఇదీ వాస్తవం

  1. ఇప్పటికీ 9 లక్షల మంది పేదలు జగన్‌ సర్కారు ఇచ్చిన ఇంటి పట్టాలు తీసుకోలేదు.

  2. రాజధాని అమరావతిపై కోపంతో ఆర్‌-5 జోన్‌లో 50 వేలమందికి స్థలాలు కేటాయించారు. న్యాయ వివాదంతో ఇదీ అమల్లోకి రాలేదు.

  3. 4 లక్షల టిడ్కో ఇళ్లు కూడా ఈ జాబితాలో చేర్చారు.

  4. 3.8 లక్షల మేర ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ, 2.75 లక్షల మేర పేదల సొంతింటి స్థలాలు కూడా జాబితాలో ఉన్నాయి.

  5. దాదాపు 25 వేలమందికి పైగా పట్టాలు ఇచ్చి ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపలేదు. గజం కూడా ఇవ్వలేదు.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 06:43 AM