Polluted water కలుషిత జలం కాటేస్తోంది!
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:59 PM
Polluted water is biting! తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో నాగావళి కలుషితమవుతోంది. ఒడిశా పరిశ్రమ వ్యర్థాలతో నదిలో నీరు రంగు మారుతోంది. చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి. దీంతో గిరిజన మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగు మారిన నది నీరు
మృత్యువాత పడుతున్న చేపలు
ఆందోళనలో గిరిజన మత్స్యకారులు
ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
గరుగుబిల్లి, ఏప్రిల్5(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో నాగావళి కలుషితమవుతోంది. ఒడిశా పరిశ్రమ వ్యర్థాలతో నదిలో నీరు రంగు మారుతోంది. చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి. దీంతో గిరిజన మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలోని పలు ఫ్యాక్టరీలకు చెందిన వ్యర్థాలను ఏడాదికొకసారి నాగావళి నదిలోకి విడుదల చేస్తుంటారు. అయితే ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇలా చేస్తుండడంతో తోటపల్లి ప్రాజెక్టులో మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలోని కుడి ప్రధాన కాలువకు ఆనుకుని అధికంగా చేప పిల్లలు మృతి చెంది ఒడ్డుకు చేరుతున్నాయి. నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన కూడా వస్తోంది. కొద్ది నెలల కిందటే ప్రాజెక్టులోకి సుమారు 2 లక్షలకు పైగా పలు రకాల చేప పిల్లలను విడుదల చేశారు. అవి పెరుగుతున్న సమయంలో మృతి చెందడంతో గిరిజన మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయం తెలిసి ప్రాజెక్టులోని చేపలను కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రాజెక్టుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు లబోదిబోమంటున్నారు. పలుమార్లు ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని గిరిజన మత్స్యకారులు వాపోతున్నారు.
చేపల వేటకు వెళ్లలేక..
ప్రాజెక్టు పరిధిలోని మార్కొండపుట్టి, గుణానుపురం, బాసంగి, గదబవలస, నందివానివలస, సుంకి, గిజబ, చిన్నపువలస, పిన్నింటిరామినాయుడువలస, కోటవానివలసతో పాటు పలు గ్రామాలకు చెందిన 500 గిరిజన కుటుంబాలకు చేపల వేటే ఆధారం. ప్రస్తుతం నదిలో వ్యర్థాలు కలిసి నీరు కలుషితం కావడంతో చేపల వేటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధిని కోల్పోయిన వారు వేరే పనుల్లోకి వెళ్లలేక.. పస్తులతో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
తగ్గుతున్న నీటి మట్టం
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో నీటి మట్టం రోజు రోజుకీ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.06 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. పైప్రాంతం నుంచి 153 క్యూసెక్కులు రాగా నదీ మార్గం గుండా 150 క్యూసెక్కులు, పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 50 క్యూసెక్కులను తాగునీటి సౌకర్యార్థం సరఫరా చేస్తున్నారు. అధిక ఎండలతో పైనుంచి నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ఏదేమైనా గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు.
అధికారులకు తెలియజేశాం
ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన పలు పరిశ్రమలు రాత్రి సమయాల్లో నాగావళి నదిలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. దీంతో తోటపల్లి ప్రాజెక్టులో నీరు రంగు మారుతోంది. చేప పిల్లలు మృతి చెందుతున్నాయి. దీంతో మేము ఉపాధిని కోల్పోతున్నాం. ఈ సమస్యపై తీర్మానం చేసి పలుమార్లు అధికారులకు తెలియజేశాం.
- ఈదల తిరుపతిరావు, గిరిజన మత్స్యకార సంఘం అధ్యక్షుడు, కోటవానివలస
====================================
సమాచారం అందలేదు
ఒడిశా రాష్ట్రంలోని పలు పరిశ్రమల వ్యర్థాల కారణంగా తోటపల్లి ప్రాజెక్టులో నీరు రంగు మారినట్లు, చేపలు మృతి చెందినట్లు మా దృష్టికి రాలేదు. దీనిపై గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (న్యూఢిల్లీ)లో ఫిర్యాదు చేశాం. కాగా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో కోళ్ల ఫారాలకు చెందిన వ్యర్థాలను నదిలోకి విడిచిపెడుతున్నారు. ఏదేమైనా ఒడిశా పరిశ్రమల వ్యర్థాల విషయాన్ని నిర్ధారించుకుని రాష్ట్ర అధికారులకు నివేదికలు అందిస్తాం.
-టి.రఘునాథనాయుడు, డీఈఈ, తోటపల్లి ప్రాజెక్టు