Share News

Vijayawada Durga Temple: అన్నదాన విభాగంలో అవినీతి భోజనం

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:41 AM

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు పెద్ద ఎత్తున బిల్లులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేసే సిబ్బందికి మూడు నెలల్లో సుమారు రూ.20 లక్షల బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పెండింగ్‌ బిల్లులపై దేవస్థాన ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేయగా, అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Vijayawada Durga Temple: అన్నదాన విభాగంలో అవినీతి భోజనం
కూరగాయలు తరుగుతున్న సేవాబృందం సభ్యులు

దుర్గగుడి అన్నదాన విభాగంలో ఉద్యోగుల చేతివాటం

మూడు నెలల సిబ్బంది బిల్లులు రూ.20 లక్షలట..!

ఆలయ సిబ్బందితో పాటు ఉచిత సేవా సభ్యుల పేర్లు కూడా..

కమీషన్లు, మామూళ్ల డబ్బుతో సిబ్బందికి వేతనాలు

బిల్లులు వచ్చాక పంపకాలకు ఉద్యోగుల ప్రయత్నాలు

ఈవో తనిఖీల్లో బయటపడిన నిజాలు

ఇంద్రకీలాద్రి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అన్నదాన విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు పెద్ద ఎత్తున బిల్లులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేసే సిబ్బందికి మూడు నెలల్లో సుమారు రూ.20 లక్షల బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పెండింగ్‌ బిల్లులపై దేవస్థాన ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేయగా, అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవినీతి బయటపడిందిలా..

అన్నదాన విభాగ సిబ్బంది కాంట్రాక్ట్‌ గడువు గత ఏడాది నవంబరు 15న ముగిసింది. ఆ కాంట్రాక్టర్‌ 30 మంది సిబ్బందిని నియమించుకుని విధులు నిర్వహించేవారు. ప్రతినెలా సుమారు రూ.5 లక్షలను దేవస్థానం సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించేది. కాంట్రాక్టర్‌ కాలపరిమితి ముగిశాక దేవస్థానమే సిబ్బందిని నియమించుకుని పనిచేయిస్తోంది. కాగా, ఓ సేవాబృందం నిర్వాహకుడు తమ సభ్యులను 30 మందిని రోజూ భక్తులకు సేవ చేయించేందుకు పంపిస్తున్నారు. ఆ బృందం సభ్యులు ఉదయం 7 గంటలకు అర్జున వీధిలో ఉన్న శృంగేరి మఠంలోని అన్నదాన విభాగంలోకి వెళ్లి, కూరగాయలు తరిగి, ఇతర పనులు చేసి ఆ తరువాత మహామండపం రెండో అంతస్థులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు 50 మంది వరకు వస్తుంటారు. దీనినే అదునుగా చేసుకుని అన్నదాన విభాగంలోని ఆ ఇద్దరు అధికారులు.. సేవాబృందంలోని సుమారు 20 మంది కూడా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దేవస్థానం తరఫున పనిచేసే సిబ్బందితో కలిపి బిల్లులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మూడు నెలల బిల్లుల మొత్తం సుమారు రూ.20 లక్షలు పెండింగ్‌లో చూపినట్టు తెలుస్తోంది. ఈ బిల్లుల గురించి సంబంధిత ఉద్యోగులు పలుసార్లు ఈవో దృష్టికి కూడా తీసుకెళ్లారు. వీటిపై అనుమానం వ్యక్తం చేసిన ఈవో ఇటీవల అన్నదాన విభాగంలో తనిఖీలు నిర్వహించి పనిచేస్తున్న సిబ్బంది, సేవాబృంద సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది సేవాబృందం సభ్యులు విధుల్లో ఉండటాన్ని గమనించిన ఈవో వారి పేరుతో కూడా బిల్లులు పెట్టినట్లు గుర్తించి సంబంధిత ఉద్యోగులను నిలదీశారు. ఉచితంగా పనిచేసే వారి పేరుతో బిల్లులు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిల్లులు వచ్చాక పంపకాలు

అన్నదాన విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి ఆ విభాగంలో పనిచేసే పలువురు ఉద్యోగులు తమకు వచ్చే కమీషన్లు, మామూళ్ల డబ్బుతో జీతాలు చెల్లించినట్లు దేవస్థానం అధికారులే చెబుతున్నారు. బకాయి బిల్లులు వచ్చాక ఆ డబ్బును ఆ విభాగంలో ఉన్న ఉద్యోగులు పంచుకోవటానికి స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. దేవస్థానం ఉన్నతాధికారులు అన్నదానం విభాగంలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలించగా, రోజూ సేవాబృందం సభ్యులు, దేవస్థానం తరఫున ఎంతమంది పనిచేస్తున్నారన్న విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆడిట్‌ అధికారులు కూడా ప్రత్యేక దృష్టిసారించి అమ్మవారి సొమ్ము పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు అందించే అన్నప్రసాదంలో కూడా పలువురు ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, దుర్గమ్మకు సేవ చేయాలని పలు సేవాబృందాల సభ్యులు ఎంతో ఆనందంగా దేవస్థానానికి వస్తుంటారు. అలాంటివారిని అవకాశంగా తీసుకుని దేవస్థానంలో కొందరు ఉద్యోగులు తమ జేబులు నింపుకొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 28 , 2025 | 08:32 AM