VHP: 5న హైందవ శంఖారావ సభ.. తరలిరండి.. వీహెచ్‌పీ పిలుపు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:52 PM
Andhrapradesh: హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని గోకరాజు గంగరాజు మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని ఆయన పేర్కొన్నారు.

అమరావతి, జనవరి 3: హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ గోకరాజు గంగరాజు (VHP Leader Gokaraju Rangaraju) వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. 30 ఎకరాలలో ఈ సభ, పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామని తెలిపారు. బస్సులు, రైళ్ళల్లో లక్షల మంది ఈ సభకు తరలివస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. జనవరి 5 మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని గోకరాజు గంగరాజు పేర్కొన్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు: సత్యం
దేశ వ్యాప్తంగా హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం పెరిగిందని వీహెచ్‌పీ ఉమ్మడి ఏపీ క్షేత్ర కార్యదర్శి సత్యం విమర్శలు గుప్పించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దూప దీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే ఆలయాలు ఉన్నాయన్నారు. అర్చకులకు కనీసం జీవనోపాధి కూడా ఉండటం లేదని.. జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను అసలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని హైందవ శంఖారావంతో ఉద్యమం మొదలు పెట్టామన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ఆలయాల కోసం ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడకు సమీపంలో కేసర పల్లిలో జనవరి 5న హైందవ శంఖారావం జరుగుతుందన్నారు. వీహెచ్‌పీ గతంలో ఎన్నో పోరాటాలు చేసినా... ఈ శంఖారావం వాటికి విభిన్నమన్నారు. హిందూ ఆలయాలను ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి సాధించేలా చేసే పోరాటానికి విజయవాడ నుంచి తొలి అడుగు పడుతుందన్నారు. పాస్టర్లు, మౌజీలకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయని.. వారి యాత్రలకు ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. హిందూ ఆలయాల విషయంలో ఇవేమీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు.
ఉద్యోగంలో చేరడానికి ఒక రోజు ముందే టీచర్ రిటైర్మెంట్!
తిరుమల లడ్డూ కల్తీ అయిన సందర్భంలో ఎంతో వేదన చెందామన్నారు. దేవాలయాల ఆస్తులు, ఆభరణాలు మాయం చేశారని తెలిపారు. ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా మార్చారని వ్యాఖ్యలు చేశారు. 27 వేల ఎకరాల దేవాలయాల భూములు ఉమ్మడి ఏపీలో అన్యాక్రాంతం అయ్యాయన్నారు. అన్యమతస్తులు ఆలయాల్లో చేరి పెత్తనం చేస్తున్నారని తెలిపారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని ప్రభుత్వాలు గతంలో కాపాడాయన్నారు. తప్పు అని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. హిందువులు అంతా సంఘటితంగా పోరాడేందుకు ఈ సభకు వస్తున్నారని తెలిపారు. ఇది జాతీయ ఉద్యమమని.. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందన్నారు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైళ్లు, బస్సులు, కార్లు, బైక్‌లపై మూడు లక్షల మందికిపైగా శంఖారావ సభలో పాల్గొంటారని తెలిపారు. అయోధ్య రామమందిరంలో అరగంటలో లక్ష మంది దర్శనం చేసుకుంటున్నారని.. అన్ని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే... భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారన్నారు. అన్ని ఆలయాలు తప్పకుండా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జనవరి 5న గన్నవరం వైపు వచ్చే వారు ట్రాఫిక్ ఆంక్షలను గుర్తించాలని వీహెచ్‌పీ నేత సత్యం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బాబోయ్.. విద్యార్థులకు ఎన్ని సెలవులో..
నేటి నుంచి హైదరాబాదీలకు పండగే..
Read Latest AP News And Telugu News