స్థానిక ఖాళీలకు ఎన్నికలు..!
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:59 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 2020 మార్చిలో జరగాల్సి ఉంటే.. కరోనా కారణంగా వాయిదా పడడంతో 2021 ఆగస్టులో జరిగాయి.

తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు ఆదెమ్మ, సరళ రాజీనామాతో ఖాళీ
మృతి చెందిన జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్
ఖాళీగా ఆరు ఉప సర్పంచ్ స్థానాలు
నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
27న ప్రత్యేక సమావేశం.. అదే రోజు ఎన్నికలు
కర్నూలు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 2020 మార్చిలో జరగాల్సి ఉంటే.. కరోనా కారణంగా వాయిదా పడడంతో 2021 ఆగస్టులో జరిగాయి. సెప్టెంబరులో జడ్పీ, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. అప్పటి అధికార వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను నిరసిస్తూ.. నాటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆ ఎన్నికలను బహిష్కరించింది. పలు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో స్థానిక నాయకులు పోటీ చేసినా.. అధికార బలం, పోలీసులతో భయపెట్టి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో మెజార్టీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి, వెల్దుర్తి మండలం పరిషత్ అధ్యక్ష పీఠాలను నాడు వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ పదవి కోసం ఆ పార్టీలోనే ఇద్దరు నాయకుల మధ్య పోటీ ఉండడంతో అప్పటి ఎమ్మెల్యే శ్రీదేవి చెరో రెండున్నర ఏళ్లు ప్రకారం పదవీ కాలాన్ని పంచుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా మొదటి ఎంపీపీ పీఠంపై కూర్చున్న తుగ్గలి ఎంపీపీ ఆదెమ్మ, వెల్దుర్తి ఎంపీపీ బొమ్మన సరళ ఒప్పందం మేరకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ మండలాల్లో వైఎస్ ఎంపీపీలు ఇన్‌చార్జి ఎంపీపీలుగా కొనసాగుతున్నారు. బుధవారం నోటిఫికేషన్ రావడంతో ఒప్పందం ప్రకారం పోటీ పడిన రెండో ఎంపీటీసీ సభ్యుడికే ఇస్తారా..? మరో ఎంపీటీసీని ఎంపీపీ పీఠంపై కూర్చోపెడతారా..? అనేది వైసీపీలో చర్చగా మారింది. అయితే.. సంఖ్యా బలం లేకపోవడంతో వైసీపీలో ఏం జరుగుతుందో చూద్దాం..! అంటూ అధికార టీడీపీ ముఖ్యనాయకులు వేచి చూస్తున్నారు.
మళ్లీ పీఠం ఆశిస్తున్న వెల్దుర్తి మాజీ ఎంపీపీ సరళ
వెల్దుర్తి మండల పరిషత్ అధ్యక్ష పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2021 ఆగస్టులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను నాటి ప్రతిపక్ష టీడీపీ బహిష్కరించినా.. స్థానిక టీడీపీ నాయకులు పలు స్థానాలకు పోటీ చేసి నాడు వైసీపీ దౌర్జన్యాలను ఎదురొడ్డి మూడు స్థానాల్లో విజయం సాధించారు. 14 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. నాడు ఎంపీపీ పీఠం కోసం వైసీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథ్‌రెడ్డి భార్య వెల్దుర్తి-3 ఎంపీటీసీ సభ్యురాలు బొమ్మన సరళ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు, వైసీపీ నాయకుడు దేశాయి సమీర్‌కమార్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి పోటీ పడ్డారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా మొదట రెండున్నరేళ్లు బొమ్మన సరళ ఎంపీపీ పదవిలో కొనసాగారు. రెండున్నర ఏళ్లు పూర్తయిన తరువాత ఒప్పందంలో భాగంగా ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం వైఎస్ ఎంపీపీ రంగయ్య ఇన్‌చార్జి ఎంపీపీగా ఉన్నారు. 27న జరిగే ఎంపీపీలో ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం మాజీ జడ్పీటీసీ సభ్యుడు దేశాయి సమీర్‌కుమార్‌రెడ్డి తల్లి ఎల్. నగరం ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే.. మరోసారి ఎంపీపీ పీఠం తన భార్య సరళకే ఇవ్వాలని వైసీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథ్‌రెడ్డి పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఇప్పటికే పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో చర్చించినట్లు ఆ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అదే జరిగితే ఎంపీపీ పీఠం కోసం పోటీ అనివార్యం అవుతుంది. ముగ్గురు టీడీపీ ఎంపీటీసీ సభ్యుల మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), ఉప సర్పంచులు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో రాజకీయ ఒప్పందంలో భాగంగా తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్ ఆనారోగ్యంతో మరణించారు. ఆరు పంచాయతీల ఉప సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 23న సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. 27న జరిగే ప్రత్యేక సమావేశంలో మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎంపీపీ, ఉప సర్పంచులను ఎన్నుకుంటారు. పత్తికొండ నియోజకవర్గంలో రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో రాజకీయ వేడి రాజుకుంది. రాజకీయ ఒప్పందంలో భాగంగా రాజీనామా చేసినా.. వెల్దుర్తి ఎంపీపీ పీఠం కోసం వైసీపీలో పోటీ పడుతుండడంతో క్యాంపు రాజకీయాలకు తెరతీసే అవకాశం లేకపోలేదు.
తుగ్గలి ఎంపీపీ పీఠం ఏకగ్రీవం అవుతుందా..? ఇక్కడా కూడా పోటీ తప్పదా..? అనే చర్చ జరుగుతున్నది. ఈ మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ పీఠం బీసీ మహిళకు రిజర్వు చేశారు. తుగ్గలిలో ఓ స్థానం మినహా.. 16 స్థానాలకు టీడీపీ పోటీ చేసినా అప్పటి అధికార పార్టీ వైసీపీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల బెదిరింపులతో 17 స్థానాలు ఆ పార్టీలనే దక్కించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ మండల సచివాలయ కన్వీనర్ హనుమంతు భార్య శభాష్ పురం ఎంపీటీసీ సభ్యురాలు రామాంజినమ్మ ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారం చేశారు. ఎంపీపీ ఎంపికకు ముందు అనూహ్యంగా అప్పటి ఎమ్మెల్యే శ్రీదేవి సమీప బంధువు వైసీపీ నాయకుడు జగన్నాథ్‌రెడ్డి తన స్వగ్రామమైన పగిడిరాయి ఎంపీటీసీ ఆదెమ్మను తెరపైకి తెచ్చారు. దీంతో ఎంపీపీ పదవీ కాలాన్ని ఇద్దరికి రెండున్నరేళ్ల చొప్పున పంచుకొని ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా మొదట ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ఆదెమ్మ రెండున్నరేళ్లు ముగిసిన వెంటనే రాజీనామా చేశారు. ప్రస్తుతం వైఎస్ ఎంపీపీ ఎర్రనాగప్ప ఇన్‌చార్జి ఎంపీపీగా కొనసాగుతున్నారు. తాజాగా నోటిఫికేషన్ రావడంతో ఒప్పందం ప్రకారం వైసీసీ హనుమంతు భార్య రామాంజినమ్మ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం ఎంపీపీగా ఎన్నికైతే.. ఆ పదవిలో దాదాపు ఏడాదిన్నర ఉంటారు. అయితే.. ఆ పార్టీలో ఇతరులు కూడా ఎంపీపీ పీఠం కోసం తెరవెనుక యత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
జడ్పీ కో-ఆప్షన్, ఆరు ఉప సర్పంచ్ స్థానాలకు..
కర్నూలు జిల్లా పరిషత్ (జడ్పీ) కో-ఆప్షన్ సభ్యుడిగా వెలుగోడుకు చెందిన సయ్యద్ సులేమాన్‌ను నాడు వైసీపీ జడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో ఖాళీ ఏర్పడింది. 53 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే కావడంతో కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఆ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అలాగే.. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న దేవనకొండ మండలం వెలమకూరు, ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి, గుట్టపాడు, పత్తికొండ మండలం జూటూరు, ఆలూరు మండలం మొలగవల్లి, కర్నూలు మండలం సుంకేసుల ఉప సర్పంచులను ఈ నెల 27న ఎన్నుకోవాల్సి ఉంది.