Share News

భయపెడుతున్న బైక్‌లు

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:13 AM

ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. గాయపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు.

భయపెడుతున్న బైక్‌లు

70 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలవే..

అతివేగం.. అవగాహన లోపమే కారణం

దృష్టి సారించని పోలీసు శాఖ

ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. గాయపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవలి కాలంలో పరిశీలిస్తే వంద ప్రమాదాల్లో 70 ప్రమాదాలు బైకులవే. ప్రతి పది ప్రమాదాల్లో 8 దాకా మోటారు సైకిల్‌పై ప్రయాణించే వారివే ఉండటం ఆందోళన చెందాల్సిన విషయం. ఈ ప్రమాదంలో కూడా ఎక్కువ భాగం 35 ఏళ్లలోపు వారే మృతి చెందుతున్నారు. ఈ ప్రమాదాల ఘటనలన్నీ ఆందోళన కలిగిస్తుండగా.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాలన్నీ ఎక్కువ శాతం అతివేగం, పరధ్యానం, డ్రంకెన్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

కర్నూలు క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత ఏడాదిగా జరిగిన బైక్‌ ప్రమాదాలను గుర్తిస్తే.. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం వల్లనే 50 శాతం బైక్‌ ప్రమాదాలు జరిగినట్లుగా పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. మద్యం, గంజాయి సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్ల 20 శాతం ప్రమాదాలు జరిగాయి. మైనర్‌ డ్రైవింగ్‌ చేయడం వల్ల మరో 15 శాతం ప్రమాదాలు జరిగాయి. పరధ్యానం బ్రోవి ముందున్న రోడ్డును గుర్తించలేకపోవడం, మలుపులను గుర్తించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయలేకపోవడం, సడెన్‌బ్రేకులు వేయడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వంటివి మరో 15 శాతం ప్రమాదాలుగా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో హెల్మెట్‌లు ధరించి ఉంటే 25 శాతం ప్రాణాలతో బయటపడేవారని పోలీసులు చెబుతున్నారు.

గత ప్రమాదాలను పరిశీలిస్తే...

ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చిన్నటేకూరు వద్ద మూడు నెలల క్రిందట బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులు ప్రమాదం జరిగి తండ్రి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి పోలీసు శాఖ తమదైన శైలిలో విశ్లేషించింది. డ్రైవింగ్‌ చేసుతన్న కొడుకు అతివేగంగా వెళ్లడం, మరోవైపు సరైన అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

ఆదోని సమీపంలో పాండవగల్లు వద్ద జరిగిన ప్రమాదంలో రెండు మోటారు సైకిళ్లపై ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం, బస్సు డ్రైవర్‌ అతివేగం, మోటారు సైకిలిస్టుల్లో డ్రైవింగ్‌ చేస్తున్న అవగాహన లోపం, మలుపుల వద్ద ఎంత స్పీడుతో వెళ్లాలో తెలియకపోవడం, ఎదురుగా వస్తున్న వాహనాల వేగాన్ని అంచనా వేయలేకపోవడం కారణాలుగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ రెండు మోటారు సైకిలిస్టు కూడా ఒకరి పక్కన ఒకరు వెళ్తూ ఎదురుగా బస్సు వస్తున్న సమయంలో ఓవర్‌టేక్‌ చేస్తుండటం.. ఆర్టీసీ డ్రైవింగ్‌ క్రాస్‌ డ్రైవింగ్‌తోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ డ్రైవింగ్‌ చేసే వ్యక్తుల వద్ద కూడా ఎలాంటి డ్రైవింగ్‌ లైసెన్సు లేనట్లు పోలీసులు గుర్తించారు.

మూడు నెలల కిందట ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చిన్నటేకూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. కోడుమూరు మండలానికి చెందిన ఆ యువకుడి సోదరి పెళ్లికి కుటుంబసభ్యులు అందరూ ముందుగా వెళ్లిపోగా.. ఆ యువకుడు ఇంటికి తాళం వేసి తనమిత్రులతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. ఓ వైపు రాత్రి కావడం, మరో వైపు రోడ్డుపై అవగాహన లేకపోవడం, ముందుగా ఉన్న గుంతలను గుర్తించలేకపోవడంతో రోడ్డు మరమ్మతుల కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ఇంట్లో పెళ్లి ఆగిపోయింది.

కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలో బైక్‌ అదుపు తప్పి హరికృష్ణ యాదవ్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈయన మృతికి మద్యం తాగి వాహనం నడపడం వల్లే అని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

ఈ ఏడాది జనవరి 23న ఒక్కరోజే ఐదు మంది మృత్యువాత పడ్డారు. కర్నూలులో ఇద్దరు వృద్దులు మృతి చెందగా.. ఉల్చాల రోడ్డులో ఓ మహిళ మృతి చెందింది. ఆస్పరి వద్ద ద్విచక్రవాహనం లారీని ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు, పెద్దకడుబూరు సమీపంలో హనుమాపురం వద్ద ద్వీచక్రవాహనాన్ని -కారు ఢీకొన్న సంఘటనలో మరో యువకుడు దుర్మరణం చెందాడు

జనవరి 22న మంత్రాలయం సమీపంలో సూగూరు వద్ద ద్వీచక్రవాహనంలో చీర కొంగు ఇరుకుని కింద పడి మహిళ మృతి చెందింది.

జనవరి 18న హుశేనాపురం, ఓర్వకల్లు మధ్యలో ఓ కుక్కను తప్పించబోయి ద్వీచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు.

ఈ నెల 19న తుగ్గలి వద్ద ద్వీచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరు గాయపడ్డారు.

కర్నూలు నగరంలో ఈ నెల 13న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపు తప్పి కింద పడి వంశీకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు.

జనవరి 2వ తేదీన కోడుమూరు రహదారిలో కొత్తూరు కారు, బైక్‌ డీకొన్న ప్రమాదంలో దంపతులు రామగోవిందు, వరలక్ష్మి దుర్మరణం చెందారు.

నైపుణ్యం లేకపోవడమే

ఇటీవల జరుగుతున్న బైక్‌ ప్రమాదాల్లో నైపుణ్యం లేని వారు డ్రైవింగ్‌ చేయడం వల్లనే జరుగుతున్నాయి. సరైన డ్రైవింగ్‌ శిక్షణ తీసకోకపోవడం, తమ సామర్థ్యానికి మించి ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలను డ్రైవింగ్‌ చేయడం, డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రోడ్డుపైన పూర్తి స్థాయి అవగాహన ఉండడం లేదు. రోడ్డుసైడున వెళ్లకుండా సగం రోడ్డు మద్యలో వెళ్తుండటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

- మన్సూరుద్దీన్‌, ట్రాఫిక్‌ సీఐ

అవగాహన కల్పిస్తున్నా మారడం లేదు

ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు నిబంధనలపై ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చాలా మందికి డ్రైవింగ్‌ లైసెన్సు ఉండడం లేదు. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యడ్రైవింగ్‌తో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

- నల్లప్ప, సీఐ, ఆదోని రూరల్‌

Updated Date - Mar 24 , 2025 | 12:13 AM