Investigation : విశాఖ సెంట్రల్ జైల్లో సెల్‌ఫోన్ల కలకలం
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:14 AM
విశాఖ కేంద్ర కారాగారంలో రెండు సెల్‌ఫోన్లు, రెండు పవర్ బ్యాంకులు, రెండు చార్జింగ్ వైర్లు లభించడం కలకలం రేపింది.

భూమిలో పాతిన వాటిని గుర్తించిన అధికారులు
ఆరిలోవ (విశాఖపట్నం) డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్ర కారాగారంలో రెండు సెల్‌ఫోన్లు, రెండు పవర్ బ్యాంకులు, రెండు చార్జింగ్ వైర్లు లభించడం కలకలం రేపింది. ఖైదీల బ్యారక్‌ల వద్ద కవర్లతో చుట్టి నాలుగు అడుగుల లోతులో భూమిలో పాతిపెట్టి ఉంచిన వాటిని తనిఖీల్లో భాగంగా జైలు అధికారులు గుర్తించారు. ఇటీవల జైలులోని పలువురు వార్డర్ల తీరుపై అనుమానాలు రేకెత్తడంతో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఓ వార్డర్‌ను తనిఖీ చేసినపుడు ఆ సమీపంలోనే సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, చార్జింగ్ వైర్లు లభించాయని, దీనిపై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశామని జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహేశ్‌బాబు మంగళవారం తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందన్నారు.
నిబంధనల మేరకే వార్డర్ల తనిఖీ
జైలు నిబంధనలు, హెడ్డాఫీసు ఉత్తర్వులకు అనుగుణంగానే వార్డర్లను ప్రైవసీ రూంలో తనిఖీ చేసినట్టు మహేశ్‌బాబు తెలిపారు. విశాఖ జైల్లో నెలకొన్న వివాదంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన వార్తపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు జైల్లో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.