Share News

Pending Bills: పెండింగ్‌ బిల్లులు 1.30 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:09 AM

జగన్‌ ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా బకాయి పెట్టి వెళ్లిన పెండింగ్‌ బిల్లుల మొత్తం రూ. ఒక లక్షా ముప్ఫై వేల కోట్లు. ఈ విషయాన్ని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్‌ కుమార్‌ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.

Pending Bills: పెండింగ్‌ బిల్లులు  1.30 లక్షల కోట్లు

  • గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు

  • మంత్రివర్గానికి నివేదించిన రాష్ట్ర ఆర్థిక శాఖ

  • ‘జల హారతి’పై కేబినెట్‌లో చర్చ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా బకాయి పెట్టి వెళ్లిన పెండింగ్‌ బిల్లుల మొత్తం రూ. ఒక లక్షా ముప్ఫై వేల కోట్లు. ఈ విషయాన్ని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్‌ కుమార్‌ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపై పీయూశ్‌ కుమార్‌ ఈ సమావేశంలో కొన్ని వివరాలు వెల్లడించారు. పెండింగ్‌ బిల్లుల విషయం చర్చకు వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకొని....చెల్లింపు చేయాల్సిన పెండింగ్‌ బిల్లులు ఎన్ని ఉన్నాయని అడిగారు. ఆ వివరాలను పవన్‌కు పీయూశ్‌ తెలిపారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కత్తిరించి పొదుపు ఖాతాల్లో జమచేసిన డబ్బులు రూ.ఇరవై వేల కోట్లు కూడా డ్రా చేసి ఇతర అవసరాలకు గత ప్రభుత్వం వాడేసింది. వాటిని తిరిగి జమ చేయాలని కేంద్రం మనపై ఒత్తిడి తెస్తోంది. వాటిని వీలైనంత తొందరలో జమ చేయాల్సి ఉంది. చివరకు కోర్టు పరిధిలో ఉన్న డిపాజిట్లను కూడా డ్రా చేసి గత ప్రభుత్వం వాడేసింది. వీటన్నింటి చెల్లింపుల భారం మనపై పడింది’’ అని ఆయన చెప్పారు. ఇన్ని సమస్యలు ఉన్నా రాష్ట్రానికి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని, వాటివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు ఆర్థిక వ్యవస్ధ మెరుగుపడుతుందని తెలిపారు. ‘‘ఐదేళ్లకాలంలో ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని వాగ్దానం చేశాం. ఇప్పటికి ఒప్పందాలు కుదిరిన పరిశ్రమల ద్వారానే నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి’’ అని చంద్రబాబు అన్నారు.


రెవెన్యూ సమస్యలపై మంత్రుల సబ్‌ కమిటీ

రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ప్రదర్శిస్తున్నందుకు ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి అక్షింతలు వేశారు. ‘‘మీకు ఓపిక ఉండవచ్చు. కానీ ప్రజలు మీ అంత సహనంతో ఎదురు చూడలేరు. వారికి ఇప్పటికే తిరిగి తిరిగి విసుగు వస్తోందని గుర్తించండి’’ అని ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న సమస్యల పరిష్కారంపై ఆయన మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో చర్చించారు. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని, సాధ్యం అనుకొన్నవాటిని వెంటనే తేల్చేయాలని ఆయన గట్టిగా కోరారు. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకూ పదమూడు వేల దరఖాస్తులు వచ్చాయని ఆ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ చెప్పారు. ఏ రకం సమస్యలు ఏమిటో వర్గీకరించాలని, కక్ష సాధింపుగా నిషేధ జాబితాలో పెట్టిన వాటిని తొలగించడం, రీ సర్వేలో వచ్చిన తప్పులు సవరించడం, అర్బన్‌ ప్రాంతాల్లో నిషేధ జాబితాలో ఉన్న ఇళ్ల స్థలాలకు విముక్తి కలిగించడం వంటివి త్వరగా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘‘వచ్చిన వారే మళ్లీ మళ్లీ కాగితం పట్టుకొని తిరుగుతున్నారంటే వారి సమస్య పరిష్కారం కాలేదని అర్థం. మనం మాటలు చెప్పడం కాదు. పరిష్కారంపై శ్రద్ధపెట్టాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడానికి రెవెన్యూ, ఆర్థిక, మునిసిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రులతో సబ్‌ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ఈ కమిటీ ఒక స్థాయీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.


ప్రధాని పర్యటనపై...

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖకు వస్తున్నందువల్ల ఆ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. విశాఖ నగరంలో ఒక కిలోమీటర్‌ మేర రోడ్‌ షో, తర్వాత ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని నిర్ణయించారు. మూడు పార్టీల నేతల సమావేశం కోసం ఈ నెల ఐదో తేదీన లోకేశ్‌ విశాఖ వెళ్తున్నారు. విశాఖ రైల్వే జోన్‌, పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ కర్మాగారం, నక్కపల్లిలో ఫార్మా సెజ్‌, పారిశ్రామిక నోడ్‌లకు ప్రధాని ఈ సందర్భంగా శంకుస్ధాపన చేయనున్నారు. పది వేల మంది ఉద్యోగుల సామర్ధ్యంతో విశాఖలో టీసీఎస్‌ ఏర్పాటు చేయదల్చిన సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను కూడా వీలైతే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని సమావేశం నిశ్చయించింది.


పోలవరం- బనకచర్లపై చర్చ

కొత్తగా ప్రతిపాదించిన పోలవరం- బనకచర్ల భారీ నీటిపారుదల పధకంపై నీటి పారుదల శాఖ కార్యదర్శి సాయిప్రసాద్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. విభజన చట్టంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ పథకం కోసం నిధులు అడుగుతున్నామని సీఎం తెలిపారు. ఈ పఽథకం వస్తే హంద్రీనీవా ప్రాజెక్టు కింద కాల్వల వెడల్పు పెంచాల్సి వస్తుందని, దానిని దృష్టిలో ఉంచుకొని దీనికి మంజూరైన లైనింగ్‌ పనులు నిలిపివేయాలని ఆర్థికమంత్రి పయ్యావుల కోరారు. పనులు ప్రస్తుతానికి ఆపి పాత ప్రతిపాదనలు మరోసారి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Jan 03 , 2025 | 05:09 AM