Share News

Polavaram Project: ఎస్‌బీఐని కాదని ప్రైవేటుకు

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:40 AM

పోలవరం ప్రాజెక్టులో రైతులకు చెల్లించాల్సిన రూ.63 కోట్లు ప్రైవేట్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడంపై ఆరోపణలు. రైతులకు సొమ్ము ఇవ్వకుండా, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారు

Polavaram Project: ఎస్‌బీఐని కాదని ప్రైవేటుకు

  • పోలవరం పరిహారం సొమ్ము 63 కోట్లు బదిలీ

  • తణుకులోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జమ

  • రైతులకు చెల్లించేందుకు జనవరిలో విడుదల

  • 10 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

  • రైతులకు ఇప్పటికీ చెల్లించని వైనం

  • పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్‌ నిర్వాకం

  • స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌పైనా ఆరోపణలు

  • సొమ్ము బదిలీపై ఎన్నో అనుమానాలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలకు చెందిన సొమ్మును ఎక్కడా ప్రైవేట్‌ బ్యాంకుల్లో పెట్టవద్దని రెండు నెలల కిందట రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సీఎంవో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక సర్క్యులర్‌ పంపింది. అయితే పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటివ్‌ కార్యాలయం అధికారులు సీఎం ఆదేశాలను బేఖాతరు చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిహారం సొమ్ము దాదాపు రూ.63 కోట్లను ఎస్‌బీఐని కాదని ప్రైవేట్‌ బ్యాంకుకు బదిలీ చేశారు. అదికూడా 10 రోజుల్లో రైతులకు చెల్లించాల్సిన సొమ్మును వారికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ)కు భూములు ఇచ్చిన కొందరు రైతులకు జనవరిలోనే ప్రభుత్వం రూ.63,14,41,018 విడుదల చేసింది. రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట ఎస్‌బీఐ బ్రాంచ్‌కు పంపింది. పది రోజుల్లో సంబంధిత రైతులకు చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ లెక్కన ఫిబ్రవరిలోనే రైతులకు పరిహారం అందాలి. అయితే అధికారుల నిర్వాకంతో ఇప్పటికీ రైతులకు సొమ్ము అందలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఈ సొమ్మును పోలవరం ఎడమ ప్రధాన కాలువకు ఏమాత్రం సంబంధంలేని తణుకులోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు బదిలీ చేశారు. ఇటు రైతులకు సొమ్ము అందించకుండా, అటు ప్రభుత్వ రంగ బ్యాంకులోనూ ఉంచకుండా ప్రైవేట్‌ బ్యాంకులో జమ చేశారు. దీనిపై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇదీ నేపథ్యం...: రాజమహేంద్రవరం పరిధిలోని ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటివ్‌ కార్యాలయం ఉంది. ప్రాజెక్టుకు భూసేకరణ, భూమిని త్యాగం చేసిన వారికి పునరావాసం, ఉపాధి కల్పన వంటి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలను ఈ కార్యాలయం అమలు చేస్తుంది. ప్రాజెక్టు భూసేకరణకు ఇంతవరకూ యూనిట్‌-1, 2 అనే విభజనతో ఉండేవి. వాటికి అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌డీసీ) ఉండేవారు. ఇటీవల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు బాధ్యతలను ధవళేశ్వరం కేంద్రంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్‌కు అప్పగించారు. ఎల్‌ఎంసీ ప్రాజెక్టు భూసేకరణ యూనిట్‌-1 పరిధిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిమండలాలు ఉన్నాయి. ఈ మండలాల మీదుగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ విశాఖ వరకూ వెళుతుంది. ఈ కాలువ నిర్మాణానికి రైతులనుంచి 2016-2018మధ్య సేకరించిన భూమి విషయంలో అధికారులు కొన్ని తప్పిదాలు చేశారు. వాటికి సంబంధించి రైతులు సుమారు 42 కేసులు పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ రైతులను గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం వీరికి చట్టప్రకారం అందాల్సినవన్నీ అమలు చేస్తుంది. అందులో భాగంగా రూ.63,14,41,018లను జనవరిలో విడుదల చేసింది. రాజమహేంద్రవరంలోని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌డీసీ-ఎల్‌ఏ), ఎల్‌ఎంసీ యూనిట్‌-1కు చెందిన ఇన్నీసుపేటలోని ఎస్‌బీఐ కరెంట్‌ ఖాతా నంబర్‌ 11105208896లో జమ అయింది. ఇది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పేరుతో ఉంది. ఈ సొమ్మును పదిరోజుల్లో రైతులకు అందజేయాలని ప్రభుత్వం అప్పట్లోనే ఆదేశించింది. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ఒక రైతుకు రూ.2 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. వివిధ కారణాలతో ఇతర రైతులకు పెండింగ్‌లో ఉంది. అధికారులు ఈ సొమ్మును రైతుల పేరిట చెక్‌ రాసి, విశాఖలోని ఆర్‌అండ్‌ఆర్‌ అథార్టీకి(కోర్టు)అందించాలి.


అథార్టీ నేరుగా రైతులకు అందజేస్తుంది. కానీ పోలవరం అడ్మినిస్ర్టేటివ్‌ కార్యాలయం వెంటనే ఈ పని చేయలేదు. అధికారులు ఎస్‌బీఐ ఖాతాలోని ఈ సొమ్మును తణుకులోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పోలవరం ప్రాజెక్టు రాజమహేంద్రవరం ఎస్‌డీసీ (ఎల్‌ఏ), ఎల్‌ఎంసీ యూనిట్‌-1 అకౌంట్‌ నంబర్‌ 11222444614కు బదిలీచేశారు. గత నెల 26న ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్‌ ఆదేశాల మేరకు ఈ సొమ్మును బదిలీ చేయాల్సిందిగా కోరుతూ ఇన్నీసుపేట ఎస్‌బీఐ మేనేజర్‌కు ఎల్‌ఎంసీ యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎస్‌డీసీ)కె.సతీశ్‌ లేఖ రాశారు. మూడు రోజుల కిందట ఈ సొమ్మును అధికారులు తణుకులోని ప్రైవేట్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఖాతాదారు వినతిమేరకు ఇలా చేసినట్టు ఎస్‌బీఐ చీఫ్‌మేనేజర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

ఐఏఎస్‌ ఆదేశం.. ఎస్‌డీసీ లేఖ!

ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాలో ఎందుకు ఉంచలేదు? ప్రైవేటు బ్యాంక్‌ ఖాతాకు ఎందుకు బదిలీ చేశారు? ఈ ప్రశ్నలకు జవాబు లేదు. సొమ్మును ప్రైవేట్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సతీశ్‌ రాసిన లేఖ ‘ఆంధ్రజ్యోతి’ చేతికి అందింది. ఆయన్ను వివరణ కోరగా.. తానసలు లేఖ రాయలేదని, తణుకులో ఖాతానే లేదని, కేవలం ఇన్నీసుపేటలోని ఎస్‌బీఐలోనే ఖాతా ఉందని చెప్పారు. ఎంత సొమ్ము ఉందని అడగగా... అది చెప్పకూడదని సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ర్టేటర్‌గా కొద్ది నెలల క్రితమే తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ఆదేశంతోనే సొమ్ము బదిలీ చేయాల్సిందిగా ఎస్‌డీసీ లేఖ రాసినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:48 PM